గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపాస్‌ ‌పుస్తకాల పంపిణీ మార్చికి పూర్తి

2 గంటల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 12:21 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ‘మీ భూమి-మీ హక్కు’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సిఎం పర్యటన

​ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : వచ్చే ఏడాది మార్చి నాటికి పట్టాదారు పాస్‌ ‌పుస్తకాలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 9,833 గ్రామాల్లో మొత్తం 72,70,605 పట్టాదారు పాస్ పుస్తకాలను 2,027 మార్చి నాటికి పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామని చెప్పారు. భూ వివాదాలు లేకుండా రాష్ట్రాన్ని తీర్చి దిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల ఆస్తులను ప్రమాదంలోకి నెట్టే నల్లచట్టమని, ప్రజల భూములపై అనేక వివాదాలు సృష్టించి 22 ‘ఎ’లో చేర్చి లక్షలాది కుటుంబాలను ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్‌ ‌టైటిలింగ్‌ ‌యాక్ట్‌‌ను రద్దు చేశామని తెలిపారు. విలేజ్ ఇనామ్‌ భూములకు సంబంధించి 1,971 గ్రామాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామని, ఆటో మ్యూటేషన్ ద్వారా వారసత్వ ఆస్తులను వారసులకు నేరుగా బదిలీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుపతి జిల్లా శెట్టిపల్లి, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు, చిత్తూరు జిల్లా కంగుంది ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదాలను పరిష్కరించామని వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలో సాధారణం కంటే 22 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని చంద్రబాబు తెలిపారు. ఈ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా 'జలధార' కార్యక్రమాన్ని ప్రారంభించా మన్నారు. వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చుకుంటేనే భవిష్యత్తులో నీటి భద్రత సాధ్యమవుతుందని పేర్కొన్నారు

రావణ్ కు వైసిపి ఆర్థిక సాయం

‘ప్రశ్న రావణ్ అనే వ్యక్తి... పురాణాలను దూషించాడు. రాముడు, సీతపై నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని, పాకిస్తాన్‌‌ను సమర్థించాడు. ఇలాంటి వాళ్లకు గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేసింది’ అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతాల వారీగా ముక్కలు చేసే కుట్రలకు వైసిపి పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు. రౌడీలను, సంఘవిద్రోహ శక్తులను ఎవరూ ప్రోత్సహించవద్దని, కులమతాలను విభజించడానికి వీల్లేదన్నారు. రాష్ట్రంలో వింత ప్రవర్తన కలిగిన కొందరు వ్యక్తులున్నారని, ఆస్తి కోసం తల్లిని హింసిస్తున్నారని, ఓట్ల కోసం చనిపోయిన తండ్రికి పూజలు చేస్తున్నారని విమర్శించారు. తల్లిని గౌరవించలేని వ్యక్తి మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణగా ఉండాలని, ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలని, ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరిరోజు అని మళ్లీ హెచ్చరిస్తున్నానని అన్నారు. అంతకు ముందు రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకా‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రులు బిసి జనార్ధన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, ఎన్ఎండి ఫరూక్, ఎంపి బైరెడ్డి శబరి, సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.జయలక్ష్మి, కలెక్టర్ రాజకుమారి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మహిళపై సిఎం ఆగ్రహం

బనగానపల్లెలో జరిగిన 'మీ భూమి-మా హక్కు' కార్యక్రమంలో తమ సమస్యలను తెలిపేందుకు ప్రయత్నించిన ఒక మహిళపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మహిళ పట్ల అసహనం వ్యక్తం చేశారు. తన సమస్యను పరిష్కరించాలని బహిరంగ సభలో తొలుత ఓ మహిళ లేచి నిలబడి నిరసన తెలిపారు. ‘ఆ మహిళను పక్కకు తీసుకువెళ్లండి... నేను ఆ తర్వాత ఆమె నుంచి అర్జీ తీసుకుంటాను’ అంటూ పోలీసులను చంద్రబాబు ఆదేశించారు. కాసేపటికి మరో మహిళ లేచి నిలబడగా, ఆమెపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏయ్... వినమ్మా... విను. కొత్తగా ఈ డ్రామాలు నేర్చుకున్నారు. ఏమైనా సమస్య ఉంటే పక్కకు వచ్చి అర్జీలు ఇవ్వండి. మధ్యలో డిస్టర్బ్ చేయకండి’ అంటూ ఆమెపై కోపగించుకున్నారు. ‘ఆమెను నా దగ్గరకు తీసుకురండి’ అంటూ పోలీసులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్