బుషహర్ అణువిద్యుత్ ప్లాంట్ లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు
14 మంది ఇరానీయుల మృతి
గల్ఫ్‌లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడి
టెహ్రాన్/వాషింగ్గన్ : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల్లో దేశ ప్రజలంతా నిమగ్నమైన వేళ అమెరికా బాంబులతో విరుచుకుపడింది. కనీస యుద్ధ నీతిని అగ్రరాజ్యం పాటించలేదు. అగ్రరాజ్యం ఖమేనీని హత్య చేయడేకాకుండా అంతిసంస్కారాల సమయంలోనూ దాడులతో విరుచుకుపడింది. పశ్చిమాసియాలో రెండో రోజూ దాడులు కొనసాగాయి. ఇరాన్‌తో కుదిరిన ఎంఒయూకు కాలం చెల్లిపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అనంతరం దాడులను ఉదృతం చేసింది. అమెరికా సేనలు బుధవారం అర్ధరాత్రి నుంచి ఇరాన్ లక్ష్యాలపై పెద్ద ఎత్తున దాడులు చేశాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా కువైట్, బహ్‌రైన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. మొత్తంగా రెండు రోజుల్లో 170 ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు జరిపింది. అమెరికా క్రూయిజ్ క్షిపణి ఒకటి గురువారం ఉదయం అఖాలా కౌంటీలోని అగ్ తపే ఖాన్ బ్రిడ్జిపై పడింది.అయతే, అమెరికా దాడుల్లో ఇప్పటివరకు 14 మంది మరణించగా, 78 మంది గాయపడినట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ ధృవీకరించింది. అహ్వజ్ సమీపంలో అమెరికా-ఇజ్రాయిల్ సేనలు జరిపిన దాడిలో ముగ్గురు మరణించగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు వైద్య బృందాలు అవసరమైన చికిత్స అందిస్తున్నాయి. ఇరాన్‌షహర్ విమానాశ్రయంపై ఉదయం దాడి జరిగిందని, ఓ ఉద్యోగి మృతి చెందారు. విమానాశ్రయానికి చెందిన ఆపరేషన్స్ సౌకర్యాలు, వాతావరణ కేంద్రం దెబ్బతిన్నాయి. ఇరాన్ షహర్ నగరంలోని పలు ప్రాంతాలలో బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బుషహర్ రాష్ట్రంలో కూడా అనేక పేలుళ్లు సంభవించాయి. బుషహర్‌లో ఇరాన్ అణు విద్యుత్ ప్లాంటు ఉన్న విషయం తెలిసిందే. ఇరాన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న అణు ప్లాంటు అదొక్కటే. చైనా-రష్యా మధ్య వాణిజ్యం కోసం వినియోగిస్తున్న రైల్వే బ్రిడ్జి పైన అమెరికా దాడి చేసింది. బుధవారం రాత్రి నుంచి అమెరికా జరిపిన దాడులు ఇరాన్ దక్షిణ కోస్తా వెంబడి ఉన్న నగరాలను వణికించాయి. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోకుండా కట్టడి చేసేందుకే తాము ఈ దాడులు జరుపుతున్నామని అమెరికా సైన్యం చెబుతోంది.
అణు కేంద్రమే లక్ష్యంగా దాడులు?
బుషెహర్ స్థానిక అధికారి ఎహ్సాన్ జహానియన్ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా దళాలు అణు విద్యుత్ కేంద్రం సమీప ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే, ఈ దాడులపై అమెరికా అధికారికంగా ఇంకా స్పందించలేదు. అమెరికా సెంట్రల్ కమాండ్ తాము దాడులను ముగించామని ప్రకటించిన కొద్ది గంటలకే ఈ దాడులు జరగడం గమనార్హం.
ప్రతి దాడులు తప్పవు : ఇరాన్
పలు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకొని గత రెండు రోజులుగా అమెరికా సేనలు జరుపుతున్న దాడులలో 14 మంది మరణించగా 78 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రెండు రైల్వే బ్రిడ్జిలు సహా వివిధ లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ దాడులు చేసినందుకు ప్రతిగానే తాము ఈ దాడులకు పూనుకున్నామంటూ అమెరికా చేస్తున్న వాదనను తోసిపుచ్చింది. విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడి లక్ష్యాలను, ఆశయాలను ఎట్టి పరిస్థితులలోనూ నెరవేరనివ్వబోమని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. అంతిమ విజయం సాధించే వరకూ ఇస్లామిక్ విప్లవ ఆశయాలను పరిరక్షిస్తూనే ఉంటామని తెలిపింది. అమెరికా దాడులు కొనసాగిన పక్షంలో పశ్చిమాసియాలో ఇతర అమెరికా సైనిక స్థావరాలపై కూడా దాడులు చేస్తామని ఇరాన్ తెలిపింది. అయితే, ఇరాన్ ప్రయోగించిన నాలుగు క్షిపణులు, పది డ్రోన్లను విజయవంతంగా తటస్థం చేశామని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
ఒప్పందం కోసం వేడుకుంది : ట్రంప్
వరుస దాడులతో బెంబేలెత్తిన ఇరాన్ ఒప్పందం కోసం తమను వేడుకుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్ నాయకత్వం తనను సంప్రదించిందని, ఒప్పందం కుదుర్చుకోవాలని కోరిందని అన్నారు.
ట్రంప్ చేతులు చిన్నారుల రక్తంతో తడిసాయి: పెజెష్కియన్
నాటో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ స్పందిస్తూ.. ‘‘వందలాది మంది చిన్నారుల రక్తంతో చేతులు తడిసిన వ్యక్తి నుండి మేము రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ట్రంప్ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని, అహంకారాన్ని సూచిస్తున్నాయి. మేము మా హక్కులను కాపాడుకోవడంలో వెనకడుగు వేయము’’ అని ధీటుగా బదులిచ్చారు.
సరికొత్త వ్యూహాలతో ఇరాన్...
ఇస్లామబాద్‌లో కుదిరిన అవగాహనా ఒప్పందానికి (ఎంఒయు) కాలం చెల్లిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా బరితెగించి ఒప్పందాలను ఉల్లంఘిస్తూ పదే పదే సైనిక చర్యలకు పాల్పడుతోంది. ఇలాంటి పరిస్థితులలో అమెరికా మెడలు వంచడానికి, ఎంఒయు అమలయ్యేలా చూడడానికి ఇరాన్ వద్ద ఉన్న మార్గాలు ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎంఒయు కింద అంగీకరించిన స్వీయ నియంత్రణల నుంచి ఇరాన్ వైదొలగడం వీటిలో ఒకటి. అదే జరిగితే ఇరాన్ ఎలాంటి పరిమితులకు లోబడి ఉండాల్సిన అవసరం ఉండదు. అమెరికా దురాక్రమణకు ధీటుగా స్పందించవచ్చు. ఇరాన్ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేసింది. అమెరికా సైన్యం ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాలు, ద్వీపాలలోని 30 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపితే ఐఆర్‌జిసి క్షిపణులు, డ్రోన్లతో వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టింది. మొత్తంమీద 85 కీలక అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఓ ఆధునిక ఎంక్యూ-రీపర్ డ్రోన్‌ను కూల్చివేసింది. మొట్టమొదటి సారిగా ఒమన్ తీరంలో మోహరించిన అమెరికా నౌకాదళాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుంది. ఎంఒయుపై సంతకం చేసిన తర్వాత హార్ముజ్ జలసంధిపై...ముఖ్యంగా ఉత్తరాన ఉన్న రవాణా మార్గంపై తాను ఆశించిన భద్రతా ఏర్పాట్లను అమలు చేయడంలో అమెరికా విఫలమైంది. ఒమన్ కారిడార్ నిర్వహణను అమెరికాకు అనుకూలంగా మార్చాలన్న ట్రంప్ కోరిక నెరవేరలేదు. తన సార్వభౌమత్వ హక్కుల విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదని ఇరాన్ తేల్చి చెప్పేసింది. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అంకారాలో నాటో సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్ బెదిరింపులకు పాల్పడ్డారు. ఎంఒయు కథ ముగిసిందని, ఖర్క్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. దీనిపై ఇరాన్ తీవ్రంగానే స్పందించింది. తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. హార్ముజ్ నిర్వహణలో విదేశీ జోక్యాన్ని అనుమతించబోమని తేల్చి చెప్పింది.







కామెంట్‌లు (0)