పాడేరు ఐటిడిఎ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
ప్రజాశక్తి - పాడేరు టౌన్ (అల్లూరి జిల్లా) : విశాఖ నగరంలోని మారికవలసలో ఉన్న ఎపి గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా మార్చే నిర్ణయంలో భాగంగా అక్కడ చదువుతున్న విద్యార్థులను వేర్వేరు చోట్లకు తరలించడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాడేరులో చేపట్టిన ఆందోళన గురువారమూ కొనసాగింది. నిరంతరాయంగా సాగుతున్న ఈ పోరాటంతో పాడేరులో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. బుధవారం మారికవలస నుంచి విద్యార్థులను వాహనాల్లో ఇతర గురుకులాలకు తరలిస్తున్న సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు నక్కలపుట్టు వద్ద అడ్డుకుని, విద్యార్థులతో కలిసి పాడేరు ఐటిడిఎ వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. వారి పోరాటాన్ని రాత్రి వరకూ కొనసాగించారు. ఐటిడిఎ పిఒ ఆదిత్యవర్మ ఆందోళనకారులతో మాట్లాడి ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని వివరించినా తల్లిదండ్రులు వెనక్కి తగ్గలేదు. సమస్య పరిష్కరించే వరకూ అక్కడి నుంచి కదిలేది లేదంటూ రాత్రంతా అక్కడే నిద్రించి పోరాటాన్ని కొనసాగించారు. గురువారం ఉదయం కలెక్టర్ టి.నిశాంతి, ఎస్‌పి అమిత్ బర్ధర్, ఐటిడిఎ పిఒ ఆదిత్యవర్మ... ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి చర్చించారు. పాఠశాల తరలింపు నిర్ణయంపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారు. మారికవలసలో పాఠశాలను కొనసాగించాల్సిందేనని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఐటిడిఎ గేటు ఎదుట గురువారం రాత్రి నిద్రించి తమ ఆందోళనను కొనసాగించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పోరాటానికి ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స మద్దతు తెలిపి మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఆదివాసీ విద్యార్థులకు విశాఖలో ఉన్న ఏకైక ఇంగ్లీష్ మీడియం బాలుర పాఠశాలను రద్దు చేయడం సరికాదన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం ప్రత్యామ్నాయ భవనం కేటాయించి, విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు.
మారికవలస విద్యార్థుల తరలింపు తగదు :
ఇఎఎస్.శర్మ
మారికవలస గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరుతో అకస్మాత్తుగా ఇతర పాఠశాలకు తరలించడంపై కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్.శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకోకుండా విద్యారంగంలో కీలక మార్పులు తీసుకురావడం సరికాదని లేఖలో పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)