సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేపాల్లో పెరుగుతున్న మృతులు

27 ఆగస్టు, 2026

Nepal  floods
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 12:22 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 359 మృతదేహాల గుర్తింపు

  • ఆచూకీ తెలియని 288 మంది భారతీయులు

  • 826కి పెరిగిన గల్లంతైన వారి సంఖ్య

ఖాట్మండు : నేపాల్‌‌ వరదల్లో మృతుల సంఖ్య 359కి చేరిందని నేపాలీ పోలీసులు గురువారం తెలిపారు. కాగా టిబెట్‌ ‌వైపు మరో ముగ్గురు మరణించడంతో మొత్తంగా మృతుల సంఖ్య 362కి పెరిగింది. వరదల్లో గల్లంతైన 288మంది భారతీయుల ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదు. మరో 200మంది వరకు చైనా వైపు చిక్కుండిపోయారు. వారిని రక్షించేందుకు, అక్కడి సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు భారత ప్రభుత్వం నేపాల్‌, చైనా ప్రభుత్వాలతో నిరంతరంగా మాట్లాడుతోందని విదేశాంగ శాఖ గురువారం తెలిపింది.

గల్లంతైన భారతీయుల్లో ‌పర్యాటకులతో పాటూ జల విద్యుత్‌ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు కూడా వున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ ‌జైస్వాల్‌ ‌తెలిపారు. తమిళనాడుకు చెందిన 21మందిని రక్షించినట్లు తెలిపారు. మంచు ఫలకాలు కూలిపోవడంతో నేపాల్‌, టిబెట్‌‌ల్లో దిగువ ప్రవాహాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, భూ ప్రకంపనలు కూడా సంభవించాయని అమెరికా జియోలాజికల్‌ ‌సర్వే గురువారం పేర్కొంది.

​పొంచి వున్న తాజా ముప్పు

నేపాల వరద ప్రాంతంలో తాజాగా మరో ముప్పు పొంచి వుంది. వరదలు సంభవించిన ప్రాంతంలో ఏర్పడిన సరస్సులో రాన్రాను ప్రవాహం పెరుగుతూ వస్తోంది. ఏ క్షణంలోనైనా తెగిపడే ప్రమాదం వుందని నేపాల్‌ ‌దేశ విపత్తు నిర్వహణా అధికార సంస్థ గురువారం పేర్కొంది. నదుల ఒడ్డులకు దూరంగా వుండాల్సిందిగా ప్రజలను, సహాయక సిబ్బందిని కోరింది. బుధవారం నదీ ప్రవాహానికి ఏర్పడిన అడ్డంకి సరస్సుగా ఏర్పడేందుకు దారి తీసిందని అధికారులు తెలిపారు. బుధవారం నాటి ఈ ప్రకృతి ప్రకోపంలో గల్లంతైన వారి సంఖ్య 826కి పెరిగిందని పోలీసులు తెలిపారు. వీరిలో 113మంది నేపాలీ పర్యాటకులు కాగా, 85మంది ఆర్మీకి చెందిన సిబ్బంది వున్నారు. అలాగేరసువా, నువాకోట్‌ ‌జిల్లాల్లోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు 161మంది వున్నారు. కాగా 517మంది విదేశీయులు గల్లంతయ్యారని జాతీయ పర్యాటక బోర్డు వెల్లడించింది.

టిబెట్‌‌లోని గిరాంగ్‌ ‌కౌంటీలో ముగ్గురు మరణించగా, 558మంది గల్లంతయ్యారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. వీరిలో 260మంది విదేశీయులు. అలాగే నేపాల్‌ ‌వైపు గల్లంతైన వారిలో దాదాపు వందమంది చైనీయులు వున్నారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.

వరద బాధిత ప్రాంతాల్లో చైనా ప్రధాని పర్యటన

చైనా ప్రధాని లి కియాంగ్‌‌ గురువారం నేపాల్‌ ‌సరిహద్దుకు దగ్గరలో వున్న గిరాంగ్‌‌ టౌన్‌‌షిప్‌‌ను సందర్శించారు. ఆయన వెంట పలు విభాగాలకు చెందిన సీనియర్‌ ఉన్నతాధికారులుకూడా వున్నారు. జరుగుతున్న సహాయకచర్యలను సమీక్షించారు. టిబెట్‌‌లోని కైలాస పర్వతానికి యాత్రగా వచ్చిన వారిలో చాలా మంది గల్లంతయ్యారని వీరిలో అమెరికాకు చెందినవారు 65మంది, మలేసియన్లు 51మంది వున్నారని వార్తా సంస్థలు తెలిపాయి.

రెండో విడత సాయం

మిలటరీ రవాణా విమానంలో భారత్‌ ‌గురువారం మరింత సాయాన్ని నేపాల్‌‌కు పంపింది. 37.5టన్నుల మానవతా సాయాన్ని పంపామని, ఇందులో ఆహార పదార్ధాలు, మందులు, సహాయక సామాగ్రి తదితరాలు వున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ ‌సోషల్‌ ‌మీడియా పోస్టులో తెలిపారు. మొదటిరోజున 10టన్నుల సామాగ్రిని అందచేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్