గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇంకా కేంద్రం మొండిచేయే

1 గంట క్రితం

andhramap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 01:40 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 4 నెలల్లో ఇచ్చింది తొమ్మిది శాతమే

  • 65 శాతానికి చేరిపోయిన అప్పులు

  • సహాయ లోటు 168 శాతం

  • రాష్ట్ర ఖజానాపై ఒత్తిడి

  • లెక్కలు తేల్చిన కాగ్

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో కేంద్రం నిర్లక్ష్యపు ధోరణిని కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల కలంలో కేవలం తొమ్మిది శాతం నిధులు మాత్రమే విడుదల చేసింది. దీంతో రాష్ట్ర ఖజానాపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఫలితంగా పెద్ద మొత్తంలో అప్పులకు వెళ్లాల్సివస్తోంది. కంప్ర్టోలర్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ (‌కాగ్‌) ‌తాజాగా విడుదల చేసిన జులై నెల నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుండి 32,358 కోట్ల రూపయాలు వస్తాయని రాష్ట్రం అంచనా వేసింది. అయితే, ఇప్పటి వరకు కేవలం రు. 2,956 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చినట్లు కాగ్ నివేదికలో తేలింది. ఇది మొత్తం అంచనాలో 9.11శాతం మాత్రమే కావడం చర్చనీయాంశంగా మారింది. ఆశించిన విధంగా నిధులు అందకపోవడతో ఈ ఏడాది తీసుకోవాలని నిర్ణయించిన రు. 75,869 కోట్ల రుణంలో ఇప్పటికే రు.49.171 కోట్లు సేకరించారు. ఇది 65శాతం కావడం గమనార్హం. ​తాజా ఆర్ధిక సంవత్సరానికి రెవెన్యూ రాబడులు 2,34,140.14 కోట్లుగా అంచనా వేయగా జూలై వరకు రూ.54,059.20 కోట్లు సమకూరాయి. ఇది వార్షిక అంచనాల్లో 23.09 శాతంగా ఉంది. పన్నుల ద్వారా వచ్చే రాబడుల్లో జీఎస్టీ ద్వారా 17,974.67 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ ఫీజుల ద్వారా 4,092.12 కోట్లు, భూముల ద్వారా 17.64 కోట్లు, అమ్మకపు పన్నుల ద్వారా 6,966.85 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకాల ద్వారా 6,937.87 కోట్లు వచ్చాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 10,672.73 కోట్లు లభించాయి.

​భారీగా రెవెన్యూ వ్యయం

​రెవిన్యూ వ్యయం భారీగా పెరిగింది. తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా 91,001.56 కోట్లు ఖర్చుచేశారు. అంటే మొత్తం బడ్జెట్లో ఇప్పటివరకు 35.53 శాతం ఖర్చు చేసినట్లయింది. ఇందులో వేతనాల కోసం 20,434.17 కోట్లు, వడ్డీ చెల్లింపులకు 13,329.18 కోట్లు, పెన్షన్లు-ఇతర రిటైర్మెంట్‌ ప్రయోజనాలకు 13,120.02 కోట్లు, సబ్సిడీలకు 11,692.14 కోట్లు ఖర్చయ్యాయి.

​మూలధన వ్యయం రూ.9,964 కోట్లు

​మూలధన వ్యయానికి 2026-27 బడ్జెట్‌లో 48,697.70 కోట్లు కేటాయించగా, జూలై వరకు రూ.9,963.76 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మొత్తం రంగాల వారీగా వ్యయం చూస్తే సాధారణ రంగంపై రు. 32,942.86 కోట్లు, సామాజిక రంగంపై రు. 47,571.23 కోట్లు, ఆర్థిక రంగంపై రు. 20,451.23 కోట్లు ఖర్చు చేశారు. రెవెన్యూ రాబడులు రు. 54,059.20 కోట్లు ఉండగా, రెవెన్యూ వ్యయం రు. 91,001.56 కోట్లకు చేరడంతో ఆదాయం-వ్యయం మధ్య భారీ అంతరం ఏర్పడింది. ఈ కారణంగా రు. 36,942.36 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. ఇది రానున్న నెలల్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్