గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనియంతృత్వ పోకడలకు హెచ్చరిక ‘జెన్‌జీ ఇకపై నిశబ్ధంగా ఉండదు’

1 గంట క్రితం

ZNG.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 12:29 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సెమినార్‌‌లో ఐషీఘోష్‌

  • భారీగా తరలివచ్చిన విద్యార్థులు

  • కిక్కిరిసిన ఎంబివికె

ప్రజాశక్తి–అమరావతి బ్యూరో : దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేపట్టిన జెన్‌జీ ఉద్యమం కేంద్రంలోని నియంతృత్వ పోకడల, అహంకార పాలనకు గట్టి హెచ్చరికగా నిలిచిందని జెఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షురాలు, ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్‌ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె)లో గురువారం జరిగిన ‘జెన్‌ జీ ఇకపై నిశ్శబద్ధం ఉండదు’ సెమినార్‌‌లో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలి రావడంతో విజ్ఞానకేంద్రం కిక్కిరిసిపోయింది. సెమినార్‌‌లో ఆమె మాట్లాడుతూ ప్రజల ప్రశ్నించే హక్కును అణచివేయడం ఎప్పటికీ సాధ్యం కాదని, ప్రజాస్వామ్యమే శాశ్వతమని చెప్పారు. జంతర్‌ మంతర్‌ వేదికగా 37 రోజులపాటు సాగిన విద్యార్థి, యువజన ఉద్యమం దేశంలోని విద్యా, ఉపాధి సమస్యలను జాతీయ స్థాయిలో చర్చకు తీసుకొచ్చిందన్నారు. విద్యా వ్యవస్థలో లోపాలు, నిరుద్యోగం, ప్రశ్నపత్రాల లీకేజీలు, ప్రభుత్వ విద్యాసంస్థల మూసివేత వంటి సమస్యలపై విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసులు లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌, పెల్లెట్‌ గన్స్‌ ప్రయోగించినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదన్నారు. ప్రజాధనాన్ని భారీ విగ్రహాలు, ఫ్లెక్సీలు, అనవసర ప్రచారాలకు ఖర్చు చేయకుండా విద్యారంగానికి మళ్లించాలని ఐషీ ఘోష్‌ డిమాండ్‌ చేశారు. దేశంలో గత ఏడేళ్లలో 96 వేల పాఠశాలలు మూతపడటం దారుణమన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో జాతీయ విద్యా విధానం 2020 విద్యారంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టిందని చెప్పారు. నీట్‌ ‌లీకేజితో 22 మంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలను వ్యక్తిగత ఘటనలుగా మాత్రమే చూడరాదని, ప్రభుత్వ విద్యా, ఉపాధి విధానాల్లోని వైఫల్యాల ప్రతిబింబంగా చూడాలని అన్నారు. విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు వారి సమస్యలను నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. జెన్‌జీ స్ఫూర్తితో జెన్‌ఆల్ఫా విద్యార్థులు కూడా తమ సమస్యలపై గళమెత్తుతున్నారని తెలిపారు.జంతర్‌ మంతర్‌ ఉద్యమ సమయంలో ఇంటర్నెట్‌ ఆంక్షలు, ఇతర నిర్బంధ చర్యలు ఎదురైనా విద్యార్థులు వెనక్కి తగ్గలేదని చెప్పారు. ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్న ప్రాంతాలకు కిలోమీటర్ల దూరం వెళ్లి వీడియోలు, సందేశాలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారని తెలిపారు. విద్యార్థులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా తరలించారని, అయినా ఉద్యమాన్ని ఆపలేకపోయారని చెప్పారు. దేశభక్తి పేరుతో విద్యార్థులపై దాడులు చేయడం సరికాదని, విద్యా హక్కు కోసం పోరాడటమే నిజమైన దేశభక్తి అని పేర్కొన్నారు. విద్యను కొద్దిమందికే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్‌ చేశారు.భగత్‌సింగ్‌, సావిత్రిబాయి ఫూలే, ఫాతిమా షేక్‌, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్ ఆశయాల సాధనకు విద్యార్థులు, యువత ముందుకు రావాలని ఐషీ ఘోష్‌ పిలుపునిచ్చారు. విద్యార్థులు విడివిడిగా కాకుండా సంఘటితంగా, విద్యావంతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడితేనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని అన్నారు. మాజీ ఎంఎల్‌‌సి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ దేశంలో అనేక దఫాలుగా సాగిన ప్రజా ఉద్యమాలు ప్రశ్నించే గొంతుకలకు స్ఫూర్తినిచ్చాయన్నారు. రాష్ట్రంలోనూ విద్యావ్యవస్థ ప్రమాదంలో ఉందని, గత మూడేళ్లలో 972 పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు.

దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమం సాగుతున్న సమయంలో దానికి మద్దతు ఇవ్వాల్సిన రాజకీయ పక్షాలు అవమానకరంగా వ్యాఖ్యానించడం విచారకరమన్నారు.ఈ కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్నకుమార్‌ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు భగత్‌ ‌రవి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ప్రసాద్‌, సమీర్‌, సింధు, భాస్కర్‌ ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ్‌, కృష్ణ జిల్లా అధ్యక్షులు సమరం, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రాయన్న, జెన్‌జీ యువత పార్కర్‌, హమీద్‌, మేఘన రెడ్డి, విద్యార్థులు, విజయవాడ సివిల్‌ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో ‘నిశ్శబ్దం బద్దలైంది’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఐషీ ఘోష్‌ను నిర్వాహకులు ‘రెడ్‌ సెల్యూట్‌’తో అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్