ఐదు జిల్లాలపై తీవ్ర ప్రభావం
సిఎంకు అధికారుల నివేదన
రైతులకు అండగా నిలవండి : ముఖ్యమంత్రి ఆదేశం
కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రం మీద ఎల్‌నినో ప్రభావం అంచనాలకు మించి ఉండబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారులు నివేదించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఎల్‌నినో ప్రభావం, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో అవగాహనపై ముఖ్యమంత్రి మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితులను వివరించడంతో పాటు, నివేదికను సమర్పించారు. జూలై నెలలో 69 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వచ్చే మూడు నెలల్లో సరాసరి 35 నుంచి 40 శాత మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న అధికారులు, జూన్ – నవంబర్ మధ్య 844 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 551 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రం మీద ఎల్‌నినో ప్రభావం అంచనాలకు మించి ఉంటుందని, దానికి తగ్గట్టుగా సిధ్దం కావాల్సిఉంటుందని చెప్పారు. అంచనాలకు మించి ఎల్‌నినో ప్రభావం ఉండబోతోందని తెలిపారు. ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం అన్ని జిల్లాలపైనా ఎల్‌నినో ప్రభావం ఉంటుందని, పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా, కడప జిల్లాలపై మరింత తీవ్రంగా ప్రభావం ఉంటుందని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వరదలు, తుఫాన్లను పర్యవేక్షించిన విధంగా ఎల్‌నినో అంశాన్ని అదేవిధంగా పర్యవేక్షించాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని, వచ్చిన డేటాను విశ్లేషించిన సూచనలివ్వాలని, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేలా రైతు సేవా కేంద్రాల సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు. పాంత్రాల వారీగా పంటలకు ఇబ్బందులను గమనించి, అక్కడ బోర్లు ఏమైనా అందుబాటులో ఉన్నాయా.. అనే సమాచారంతో రైతులకు సరైన సూచనలు ఇచ్చేలా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోందనేది రైతులకు ముందుగానే చెప్పాలని, రైతులకు సరైన సమాచారం ఆగస్ట్ 3 నుంచి అవగాహన కార్యక్రమాలు, వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి, అత్యవసర విత్తన ప్రణాళికను అమలు చేయాలన్నారు. వేసిన పంటలకు బీమా నమోదు చేయాల్సిందేనని, దానికి కలెక్టర్లే బాధ్యత వహించాలని హెచ్చరించారు. తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఏడాదికి అవసరమైన పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
విబి గ్రామ్ జి పథకాన్ని వినియోగించుకోండి
రాష్ట్రంలో పశుగ్రాసం విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పాల ఉత్పత్తి ఎంత మాత్రమూ తగ్గకుండా చూసుకోవాలని, దీనికోసం విబి గ్రామ్ జీ పథకాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యాన పంటలకు ఈ పథకం నిధులను వాడుకోవచ్చన్నారు. ఎల్‌నినో ఉపద్రవాన్ని అధికార యంత్రాంగం ఓ సవాల్ గా తీసుకుని పని చేయాలని ఆదేశించారు. మార్కెట్ కమిటీలు, నీటి సంఘాల సభ్యులను ఎల్‌నినో అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలన్నారు. వాతావరణ పరిస్థితులను.. పంటలను అధ్యయనం చేసేందుకు, రైతులకు సూచనలు చేసేందుకు.. వ్యవసాయ యూనివర్శిటీ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్ఎస్కే సిబ్బందిని కన్వీనర్లుగా నియమించుకుని కార్యాచరణ అమలు కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. మంత్రులు మొదలుకుని అధికార యంత్రాంగం మొత్తం క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ ఉండాలని సూచించారు. ఈ సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరయ్యారు.







కామెంట్‌లు (0)