mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరెండేళ్లలో రూ.20,136 కోట్ల విద్యుత్ భారం

1 గంట క్రితం

arun kumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 12:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • విద్యుత్‌ నివేదికపై వైసిపి ఎమ్మెల్సీ అరుణ్‌‌కుమార్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదంటూ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విడుదల చేసిన నివేదిక పచ్చి అబద్ధాల పోస్టర్ అని వైసిపి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. గురువారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై ఏకంగా రూ.20,136 కోట్ల అదనపు భారాన్ని మోపారని తెలిపారు. సర్ ఛార్జీలు, అడ్జెస్ట్‌మెంట్ ఛార్జీలతో సామాన్యుడిని దోచుకుంటూ ఛార్జీలు పెంచలేదనడం పచ్చి అబద్ధమని తెలిపారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన బంగ్లా దాటి బయటకు వస్తే పెరిగిన విద్యుత్ బిల్లుల వాస్తవాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. 2024 డిసెంబరులో ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రూ.6,772 కోట్లు, 2025లో రూ.9,412 కోట్లు, ఆర్థిక సంవత్సరాల వారీగా రూ.1,863 కోట్లు (2024-25), రూ.2,787 కోట్లు (2025-26) చొప్పున పెంచిందని తెలిపారు. రాష్ట్రంలో ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా వెళ్లి జూన్ 2024 బిల్లు ఎంత? జూన్ 2026 బిల్లు ఎంత? చెక్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హిడెన్ ఛార్జీలు ఎలా వసూలు చేస్తున్నారో ప్రజల ముందే లెక్కించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. 2014 నాటికి ఎపి విద్యుత్ రంగ అప్పు రూ. 29,551 కోట్లు ఉంటే, 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం దానిని రూ. 86,215 కోట్లకు పెంచి విద్యుత్ రంగాన్ని నాశనం చేశారని, ఆ కాలంలో సిఎజిఆర్ అప్పుల వృద్ధి 24 శాతంగా ఉందన్నారు. వైయస్సార్‌సిపి హయాంలో (2019-24) అది 7.65 శాతానికే పరిమితమైందని తెలిపారు. టిడిపి హయాంలో డిస్కమ్‌లకు రూ.13 వేల కోట్ల సబ్సిడీ ఇస్తే వైసిపి ప్రభుత్వం రూ. 49 వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సెంటివ్‌లు ఇచ్చి డిస్కమ్‌లను ఆదుకుందని వివరించారు. 2014-19 మధ్య టిడిపి నిర్లక్ష్యం వల్ల డిస్కమ్‌ల బాకీలు రూ.6,625 కోట్ల నుంచి రూ.28,715 కోట్లకు పెరిగాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి యూనిట్ రూ. 2.69 కే సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ గగ్గోలు పెట్టారని, ఇవాళ అదే సెకీని పక్కనబెట్టి, ఆక్సిస్ ఎనర్జీ వెంచర్స్ అనే ప్రైవేట్ సంస్థ నుంచి ఏకంగా యూనిట్ రూ.4.60 చొప్పున కూటమి ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు. తక్కువ ధరకు ఇచ్చే ప్రభుత్వ సంస్థను వదిలి, ప్రైవేటు సంస్థలకు ఎక్కువ రేటు చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్