శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సమరశీల పోరాటాలతోనే భవిష్యత్తు

1 గంట క్రితం

aiks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 01:10 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- పన్నెండేళ్ల మోడీ పాలనలో రైతు మనుగడ ప్రశ్నార్ధకం

- ఆ బాటలోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం

- బహిరంగసభలో వక్తలు

- ఎపి రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఏలూరులో కర్షక ర్యాలీ, సభ

ఏలూరు నుంచి కెఎస్‌వి ప్రసాద్‌ : సమరశీల పోరాటాలతోనే రైతు రక్షణ, వ్యవసాయ పరిరక్షణ సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ‌రైతు సంఘం శుక్రవారం ఏలూరులో నిర్వహించిన బహిరంగసభలో వక్తలు పేర్కొన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఐక్య ఉద్యమాలతో తిప్పికొడితేనే భవిష్యత్తని, అందుకు రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎపి రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు జూలై 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు ఏలూరులో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏలూరు నగరంలో శుక్రవారం జూట్‌‌మిల్లు సెంటర్‌ ‌నుంచి కలెక్టరేట్‌ సమీపంలోని బహిరంగసభా ప్రాంగణం (‌‌రుద్రరాజు సత్యనారాయణ-ఆర్‌ఎస్‌ నగర్‌) వరకు ప్రదర్శన నిర్వహించారు. ‘హలో రైతన్నా.. చలో ఏలూరు’ నినాదంతో ర్యాలీలో కర్షకులు కదం తొక్కారు. అనంతరం ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య అధ్యక్షతన సభ జరిగింది. అఖిల భారత కిసాన్‌‌సభ (ఎఐకెఎస్‌) ‌ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌ ప్రసంగిస్తూ దేశంలో, రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందన్నారు. ‘తాము అధికారంలోకొస్తే రైతులెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని. అచ్చే దిన్‌ (మంచి రోజులు) ‌తీసుకొస్తామని 2014లో నరేంద్ర మోడీ పలు హామీలిచ్చారు. ప్రస్తుతం రైతులకు సేద్యం చేయలేని సంక్షోభ రోజులు దాపురించాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ పన్నెండేళ్లల్లో ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో కౌలు, దళిత, గిరిజన, దళిత, మహిళా రైతులు, వ్యవసాయ కూలీలు లేరు. వారందర్నీ కలిపితే పది లక్షల మంది సాగు సాగించలేక బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇటువంటి దుర్భర స్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు. మోడీ ప్రభుత్వం గతంలో రద్దు చేసుకున్న మూడు నల్ల వ్యవసాయ చట్టాలను దొడ్డిదారిలో చొప్పిస్తోంది. అమెరికాతో కుదుర్చుకోబోయే ఒప్పందం మన రైతాంగాన్ని ఘోరంగా దెబ్బతీస్తుంది. అమెరికాలో ఒక ఎకరాకు రైతులకు ఏడాదికి రూ.22 లక్షల సబ్సిడీ అందుతుంది. ఇక్కడ అన్నీ కలుపుకుంటే దక్కేది రూ.34 వేలు మాత్రమే. అదీ కౌలు రైతులకు, పేద రైతులకు అందదు. అమెరికా, యూరోపియన్‌ ‌యూనియన్‌, న్యూజిలాండ్‌తో భారత్‌ ‌చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల మూలంగా మన దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా ఆ దేశ ఉత్పత్తులు వచ్చి పడితే ఇప్పటికే ధర లేక అవస్థలు పడుతున్న రైతులకు ధరలు మరింతగా దిగజారతాయి. రైతు మనుగడ ప్రశ్నార్ధకమవుతుంది.’ అని అన్నారు.

కార్పొరేట్ల ప్రాపకం

ఒక వైపు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ, కార్పొరేట్లకు భూములు ధారాదత్తం చేసే విధానాలు అమలు చేస్తుండగా, ఈ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అదే బాట పట్టిందని విజ్జూ చెప్పారు.. ‘రాజధాని అమరావతి ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు (ఒఆర్‌ఆర్‌) కూటమి సర్కార్‌ ‌కార్పొరేట్‌ ‌పక్షపాతానికి ఒక పెద్ద ఉదాహరణ. కర్ణాటక, మహారాష్ట్రలో 60 మీటర్లు, కేరళలో 45 మీటర్ల రోడ్డు అయితే ఇక్కడ 250 మీటర్లు. ఎవరి కోసం ఈ పని చేస్తున్నారు? దీనివలన వేలాది మంది నిర్వాసితులవుతున్నారు. పోలవరంలో 4 లక్షల మందిని నిరాశ్రయులను చేశారు. ఎక్కడా 2013 భూసేకరణ చట్టం అమలు చేయలేదు. మోడీ ఎరువులను తగ్గించమంటే ఇక్కడ యాప్‌‌లు తీసుకొచ్చారు.’ అని అన్నారు.

చావడమా? పోరాడటమా?

రైతుల సమస్యలపై ఎఐకెఎస్‌ ఏర్పడిననాటి నుంచీ పోరాడుతోందని విజ్జూ వివరించారు. ‘1936లో ఈ రాష్ట్రంలో తమ్మారెడ్డి సత్యనారాయణ నేతృత్వంలో ఇఛ్చాపురం నుంచి మద్రాసు వరకు రైతు రక్షణ యాత్ర, కేరళలో ఎకె గోపాలన్‌ ‌నాయకత్వంలో కన్నూరు నుంచి మద్రాసు వరకు ఆకలి యాత్ర చరిత్రలో నిలిచిపోయాయి. ఇటీవలి నాసిక్‌-‌ముంబయి మహా పాదయాత్ర ప్రసిద్ధి గాంచింది. మూడు నల్ల వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన పోరాటంలో కీలకంగా ఎఐకెఎస్‌ ‌పని చేసింది. దేశంలో కోటి 60 లక్షల సభ్యత్వంతో అతిపెద్ద రైతు సంఘంగా ఎఐకెఎస్‌ ఉంది. నవంబర్‌‌లో జరిగే ఎఐకెఎస్‌ అఖిల భారత ‌మహాసభలు భవిష్యత్‌ రైతాంగ పోరాటాలకు దిశా నిర్దేశం చేస్తాయి. ప్రస్తుతం రైతుల మందు రెండు దారులున్నాయి. చావడమా... తుది వరకు పోరాడటమా? భవిష్యత్తు కోసం, ప్రత్యామ్నాయం కోసం ఐక్య, సమరశీల పోరాటాలకు రైతులు సిద్ధం కావాలి.’ అని విజ్జూ పిలుపునిచ్చారు.

ఏ రైతూ సంతోషంగా లేడు

‌రాష్ట్రంలో ఏ రైతూ సంతోషంగా లేడని ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్‌‌రెడ్డి అన్నారు. కనీస మద్దతు ధరలకు పంటలను ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదన్నారు.‘మోడీ ప్రభుత్వం అడుగు జాడల్లోనే రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం నడుస్తోంది. అదానీ, అంబానీలకు భూములు కట్టబెట్టేందుకు తహ తహలాడుతోంది. పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు పెడుతోంది. తిరగబడి ఎదురుతిరిగిన చోట రైతులు తమ భూములు కాపాడుకుంటున్నారు. ప్రభుత్వ భూదాహం, భూకబ్జాలకు వ్యతిరేకంగా పోరాటాలకు రైతులు సిద్ధం కావాలి. ఉచిత పంటల బీమాను ప్రభుత్వం అమలు చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల కోసం రైతులు ఉద్యమించాలి. పేద, సన్న, చిన్న, మధ్యతరగతి రైతుల సమస్యల పరిష్కార లక్ష్యంగా పోరాటాలు నిర్వహించాలి’ అని ప్రభాకర్‌‌రెడ్డి చెప్పారు.

మాటలే తప్ప చేతల్లేవు

కౌలు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని అధికారంలోకొచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం రెండేళ్లల్లో చేసిందేమీ లేదని ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం అన్నారు.‘కౌలు రైతుల విషయంలో మాటలే తప్ప చేతల్లేవు. కౌలు రైతులకు గత వైసిపి ప్రభుత్వం ద్రోహం చేసిందన్న టిడిపి కూటమి తానూ అదే బాట పట్టింది. కనీసం అన్నదాతా సుఖీభవ ..సాయం కూడా చేయలేదు. డెల్టాలలో 60-80 శాతం మంది సన్న. చిన్న, పేద, కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు. అన్ని పంటల్లోనూ వారే. కౌలు రైతుల పోరాటాలు మరింత పెంపొందించాలి. వారికి రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు అండగా నిలబడాలి. పంటల వారీగా పోరాటాలకు కలిసి రావాలి.’ అని బలరాం చెప్పారు. ఎఐకెఎస్‌ ‌సహాయ కార్యదర్శి టి సాగర్‌, రైతు సంఘం ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, ఇతర రాష్ట్ర ఆఫీస్‌ ‌బేరర్లు, సీనియర్‌ ‌నేత వై కేశవరావు, నిర్వాసితుల సంఘం నాయకులు మంతెన సీతారాం వేదికపై ఆశీనులయ్యారు. తొలుత రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్‌ ఆహ్వానితులను వేదికపైకి ఆహ్వానించగా, మహాసభల ఆహ్వానసంఘం నేత ఆర్‌ ‌లింగరాజు వందన సమర్పణ చేశారు. ప్రజా నాట్యమండలి కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్