పియుఇ, డబ్ల్యుయుఇ ప్రభావం ఎంత?
ప్రశ్నించిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రపంచ వ్యాప్తంగా హైపర్ స్కేల్ డేటా సెంటర్ల వల్ల విద్యుత్, నీటి వినియోగం, కార్బన్ ఫుట్ ప్రింట్‌పై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ విద్యుత్ వినియోగ సామర్థ్యం (పియుఇ), నీటి వినియోగ సామర్థ్యం (డబ్ల్యుయుఇ) ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా, ప్రాజెక్టు వారీ ప్రభుత్వం అంచనా వేస్తుందా? అని ప్రభుత్వాన్ని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రశ్నించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా బుధవారం ఆమె మాట్లాడుతూ.. నెదర్లాండ్స్‌లోని ఒక డేటా సెంటర్ 84 మిలియన్ లీటర్ల నీటిని వినియోగించడంతో 2021లో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్‌కు ఏడాదికి ఎంత నీరు అవసరం ఉంటుంది? ఆ నీటి వనరులు ఏమిటి? అని ప్రశ్నించారు. డేటా సెంటర్ నీటి అవసరాలపై ప్రభుత్వం సమగ్రంగా అంచనా వేసిందా, ఒక్కసారి డెటా సెంటర్‌ను ఆన్ చేసిన అనంతరం ఆపే పరిస్థతి ఉండదని, అది నిరంతరం పని చేస్తూనే ఉండాలన్నారు. ఈ సెంటర్ విద్యుత్ వినియోగంపై, విద్యుత్ మౌలిక సదుపాయాలపై గురించి ప్రశ్నించారు. సంబంధిత మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ.. ప్రస్తుత సాంకేతికత ప్రకారం 6.5 గిగావాట్ల డేటా సెంటర్లు విశాఖలో ఇన్‌స్టాల్ అయితే 3 టిఎంసిల నీరు అవసరమవుతుందని తెలిపారు. వాటర్ కూల్ మాత్రమే కాకుండా ప్రస్తుతం ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారన్నారు. ఇంకా కొత్త టెక్నాలజీలు వస్తున్నాయని, నీటి వినియోగం మరింత తగ్గించుకుంటున్నట్లు చెప్పారు. ఎనర్జీ అవసరాలు కూడా తగ్గించే టెక్నాలజీ రాబోతోందని, పరిశ్రమలకు కేటాయించిన నీటి వాటా నుంచే డేటా సెంటర్లకు అవసరమైన నీరందిస్తామని తెలిపారు. డేటా సెంటర్లు కనీసం 70 శాతం గ్రీన్ ఎనర్జీ వాడాలని స్పష్టంగా చెప్పామన్నారు. కేవలం కూలింగ్ ఎకోసిస్టమ్ వల్ల 20 వేలమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. భూమా అఖిలప్రియ అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంత భవనాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఒక్కొక్క డిగ్రీ కాలేజీ పూర్తిచేసి అన్ని హంగులూ కల్పించడానికి రూ.15 కోట్లు చొప్పున ఖర్చవుతుందన్నారు. ఆళ్లగడ్డకు డిగ్రీ కాలేజీ భవన నిర్మాణాలకు అన్ని చర్యలూ తీసుకుంటామని చెప్పారు. ఏలేరు కాల్వ బెడ్ లెవల్ 3 నుంచి 8 అడుగుల వరకూ కుంగిపోవడంతో రైతులకు సాగునీరు అందడం లేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ.. ఏలేరు ఆయకట్టుకు సాగు, తాగునీటి సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రెండేళ్లలో రూ.25 కోట్లతో 548 పనులు చేపట్టామని, పోలవరం ఎడమ కాలువ నుంచి 700 క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్‌కు తరలించినట్లు చెప్పారు. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సిబ్బంది ఇళ్ల మ్యాపింగ్ సవరణకు అవకాశం లేకపోవడంతో అనేక మంది ప్రభుత్వ పథకాలను కోల్పోతున్నారని ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ అంశంపై మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పందిస్తూ.. రేషన్ కార్డుల్లో మార్పులు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్పులు, చేర్పులపై ప్రజల నుంచి వచ్చిన 2 లక్షల 16 వేల వినతులను పరిష్కరించామన్నారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. సభ్యులడిగిన మరో ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం కింద రూ.3,302.68 కోట్లు బడ్జెట్ విడుదల చేసినట్లు తెలిపారు. ఈ మొత్తంలో రూ.1,123.47 కోట్లను కళాశాల, విద్యార్థుల ఖాతాలకు సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాదికి అవసరమైన బడ్జెట్‌ను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం నిర్మాణంపై ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు అడిగిన ప్రశ్నకు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిస్తూ.. అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం లేదని, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఎఇ, జెఇ, జెఎ వంటి పోస్టులకు సిబ్బంది కొరత లేదని ఆర్థికశాఖ మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ పోస్టుల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.








కామెంట్‌లు (0)