న్యూయార్క్ : న్యూయార్క్ మేయర్ మమ్దానీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశమయ్యారు. గత ఏడాది జరిగిన మేయర్ ఎన్నికల్లో మామ్దానీ ఘనవిజయం సాధించిన తర్వాత, ఇరువురు నేతలు బహిరంగంగా సమావేశం కావడం ఇది మూడవసారి. వలసల నియంత్రణ అమలు, బిలియన్ డాలర్ల విలువైన గృహనిర్మాణ ప్రాజెక్టు గురించి ఇరువురు నేతలు చర్చలు చేపట్టారు. మన్‌హట్టన్‌లో సుమారు గంట పాటు వీరిరువురూ రహస్యంగా చర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి ముందు ట్రంప్ ఈ పర్యటన చేపట్టడం గమనార్హం. చర్చల అనంతరం మీడియా సమావేశంలో .. మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మీరు గొప్ప మేయర్ అవుతారని ఆశిస్తున్నానని, గొప్పమేయర్ కాగలరని చెప్పగలనని, ఇప్పటికే ఆ చర్యలు ప్రారంభించారని ట్రంప్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా మమ్దానీ మాట్లాడుతూ.. న్యూయార్క్ పట్ల అధ్యక్షుడి నిబద్ధతను అభినందిస్తున్నామని అన్నారు. వేలాది మంది వలసదారుల తాత్కాలిక రక్షణ హోదాను ట్రంప్ తొలగించడం మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. న్యూయార్క్ వాసుల భద్రతపై తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించానని అన్నారు.
న్యూయార్క్‌లో 12,000 ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన గురించి కూడా తాము చర్చించామని మమ్దానీ అన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి సుమారు 21 బిలియన్ డాలర్ల ఫెడరల్ ప్రభుత్వ నిధులు అవసరమవుతాయని గత ఫిబ్రవరిలో అంచనా వేసిన సంగతి తెలిసిందే. తమ మధ్య అనేక విభేదాలు ఉన్నప్పటికీ, ట్రంప్‌తో సహకారాన్ని కొనసాగించాలని యోచిస్తున్నట్లు మమ్దానీ చెప్పారు. తాము విభిన్నమైన అంశాల గురించి చర్చించామని, తాను అధ్యక్షుడితోనే కాకుండా, న్యూయార్క్ ప్రజల కోసం ఎవరితోనైనా చర్చలు చేపడతానని అన్నారు.
సిఎన్‌ఎన్, ఎంఎస్‌ఎన్‌బిసి, పొలిటికో అనే మూడు వార్తా సంస్థలను వైట్ హౌస్ నుండి నిషేధించినందుకు నిరసనగా, అగ్రశ్రేణి అమెరికన్ టెలివిజన్ నెట్‌వర్క్‌లు ఆ దేశాధ్యక్షుడి కార్యక్రమాల ప్రసారాన్ని దాదాపుగా బహిష్కరించిన తరుణంలోనే ట్రంప్ ఈ పర్యటన చేపట్టారు. ఇరాన్ యుద్ధంపై వస్తున్న విమర్శల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ట్రంప్ మీడియాపై ఆంక్షలు విధించారని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు.







కామెంట్‌లు (0)