ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ విధానాలే భీమసింగి చక్కెర పరిశ్రమ మూతకు కారణం

1 గంట క్రితం

cpm.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 10:53 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పరిశ్రమ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

  • సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ

  • పరిశ్రమ పరిరక్షణకు ఉద్యమిస్తాం

ప్రజాశక్తి–విజయనగరం టౌన్‌: వేలాది మంది రైతులు, కార్మికులకు ఉపాధి కల్పిస్తూ జామి మండల అభివృద్ధికి దోహదపడిన భీమసింగి చక్కెర పరిశ్రమ మూతపడటానికి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే కారణమని సీపీఎం విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. భీమసింగి చక్కెర పరిశ్రమను ఏపీఐఐసీకి అప్పగించే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమను పరిరక్షించేందుకు రైతులు, కార్మికులు, ప్రజలను ఐక్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆదివారం విజయనగరం పట్టణంలోని ఎల్‌బీజీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1960లో ప్రారంభమైన భీమసింగి చక్కెర పరిశ్రమ ఆరు దశాబ్దాలపాటు సేవలందించిందని, సుమారు 16 వేల మంది షేర్‌హోల్డర్లతో కొనసాగిందని తెలిపారు. ప్రత్యక్షంగా సుమారు 1,500 మంది కార్మికులు, రైతులకు ఉపాధి కల్పించడంతో పాటు జామి మండల అభివృద్ధికి పరిశ్రమ కీలకంగా నిలిచిందన్నారు. పరిశ్రమపై ఆధారపడి చిరు వ్యాపారులు, చిన్న సంస్థలు కూడా ఉపాధి పొందేవారని పేర్కొన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన పరిశ్రమను కనుమరుగు చేసే పరిస్థితి రావడానికి ప్రభుత్వ విధానాలే కారణమని తమ్మినేని విమర్శించారు. ఇతర ప్రాంతాల నుంచి చక్కెరను దిగుమతి చేసుకోవడం, స్థానిక చక్కెర పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం కల్పించకపోవడం వంటి విధానాల వల్లే భీమసింగి పరిశ్రమ ఆర్థికంగా దెబ్బతిందన్నారు. వెనుకబడిన జిల్లాగా ఉన్న విజయనగరంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచాల్సింది పోయి, ఉన్న పరిశ్రమలను మూసివేసి జిల్లాను ఉపాధి రహిత ప్రాంతంగా మార్చే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.

గతంలో అప్పటి వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశ్రమ పునరుద్ధరణకు రూ.20 కోట్లు అవసరమని ప్రకటించి పునరుద్ధరిస్తామని చెప్పినా, ఆచరణలో పరిశ్రమ మూతపడే పరిస్థితి కొనసాగిందన్నారు. ఇప్పుడు దానిని ప్రైవేటు సంస్థకు అప్పగించే నిర్ణయం వరకు పరిస్థితి రావడానికి కూడా ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. చెరుకు అందుబాటులో లేకపోవడమే పరిశ్రమ మూతకు కారణమన్న వాదన వాస్తవం కాదని తమ్మినేని స్పష్టం చేశారు. రైతులకు ప్రోత్సాహం కల్పించి చెరుకు సాగును పెంచడం, పరిశ్రమను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. భీమసింగి పరిశ్రమకు సుమారు 60 ఎకరాల భూమి, మరో 9 ఎకరాల్లో కాటాలు ఉన్నాయని తెలిపారు. ఈ భూములను కోట్లాది రూపాయలకు విక్రయించి లబ్ధి పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పరిశ్రమ భూములను కాపాడటంతో పాటు రైతులు, కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భీమసింగి చక్కెర పరిశ్రమను మూసివేసి ఏపీఐఐసీకి అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఆ ప్రాంత రైతులు, కార్మికులు, ప్రజలను ఐక్యం చేసి పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని తమ్మినేని సూర్యనారాయణ హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు టి.వి. రమణ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్