ప్రతి ఆగస్టు 15న మన ఆకాశమంతా త్రివర్ణ పతాక రంగులద్దుకుంటుంది. పాఠశాలల ప్రాంగణాల్లో, పిల్లల గొంతుల్లో "జనగణమన" మార్మోగుతుంది. అమరవీరుల చిత్రాల ముందు పూలదండలు నివాళులర్పిస్తాయి. దేశం అంతా ఒక పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. కానీ ఈ వేడుకల మధ్య మనల్ని మనమే అడగాల్సిన ఒక ప్రశ్న ఉంది- అది కేవలం విదేశీ పాలకులను పంపించడమేనా? లేక ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కు సాధించడమా? అది కేవలం ఒక రాజకీయ విజయమా? లేక ఆర్థిక స్వావలంబన, సామాజిక సమానత్వం, శాస్త్రీయ దృక్పథం, రాజ్యాంగ విలువలు, మానవ గౌరవం కలిసి నిర్మించే జీవన విధానమా? ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రశ్నించిన యువత ఈ దేశాన్ని స్వేచ్ఛ వైపు నడిపించింది. నేడు జెన్.జి యువత నిరుద్యోగం, అసమానత, పర్యావరణ సంక్షోభం, విద్య, డేటా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువల కోసం ప్రశ్నిస్తోంది. కాలం మారింది. పోరాటాల రూపం మారింది. కానీ స్వాతంత్ర్యానికి అర్థం వెతికే ప్రయాణం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
2026 ఆగస్టు 15న భారతదేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించే వేడుకలు కేవలం జాతీయ పండుగగానే కాకుండా, అభివృద్ధి చెందిన భారతదేశం వైపు సాగుతున్న ప్రయాణాన్ని ప్రతిబింబించే ఉత్సవాలు. ఈ ఏడాది వేడుకలలో "వికసిత్ భారత్", "నయా భారత్" వంటి భావనలు ప్రధాన చర్చగా మారాయి. భారతదేశాన్ని 2047 నాటికి సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని ఈ వేడుకల ద్వారా ప్రజల్లో మరింత బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ స్వాతంత్ర్య దినోత్సవం గతాన్ని స్మరించుకోవడానికే కాదు, వర్తమానాన్ని ప్రశ్నించడానికి, భవిష్యత్తును నిర్మించడానికి కూడా ఒక ఆచరణాత్మక ప్రణాళిక కావాలి.
ఒక తేదీ కాదు.. తరతరాల బాధ్యత
భారతదేశ చరిత్రలో 1947 ఆగస్టు 15 ఒక మహత్తర మలుపు. శతాబ్దాల పరాధీనత తర్వాత భారతదేశం స్వేచ్ఛా శ్వాస తీసుకుంది. కానీ స్వాతంత్ర్యం అనేది కేవలం అధికార బదిలీ కాదు. అది ఒక జాతి ఆత్మగౌరవం తిరిగి నిలబడిన క్షణం. తన భవిష్యత్తును తానే నిర్ణయించుకునే హక్కును ప్రజలు తిరిగి పొందిన ఘట్టం. అప్పటి నుంచి దేశం వ్యవసాయం, పారిశ్రామిక రంగం, విజ్ఞానం, అంతరిక్ష పరిశోధనలు, సమాచార సాంకేతికత, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు వంటి అనేక రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. డిజిటల్ ఆర్థికవ్యవస్థ, స్టార్టప్ సంస్కృతి, అంతరిక్ష విజయాలు, మౌలిక వసతుల విస్తరణ దేశ అభివృద్ధి దిశగా కొత్త అధ్యాయాలను రాస్తున్నాయి. ఒకప్పుడు విదేశీ పాలన నుంచి విముక్తి కోసం పోరాడాల్సి వచ్చింది. జాతీయోద్యమంలో భాగంగా ముందుకు వచ్చిన మతసామరస్యం, స్వాలంభన నేడు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. నేడు అసమానత, నిరుద్యోగం, ఆర్థికంగా ఆధారపడటం, సమాచార నియంత్రణ, పర్యావరణ సంక్షోభం, ప్రజాస్వామ్య విలువల క్షీణత వంటి కొత్త సవాళ్ల మధ్య స్వాతంత్ర్యానికి కొత్త అర్థాలను వెతకాల్సి వస్తోంది.
మహా ప్రజా ప్రవాహం..
భారత స్వాతంత్ర్య పోరాటాన్ని కొద్దిమంది మహానాయకుల చరిత్రగా మాత్రమే చూడడం సరైంది కాదు. అది కోట్లాది ప్రజల సంకల్పం. రైతు తన పొలం నుంచి, కార్మికుడు తన కర్మాగారం నుంచి, విద్యార్థి తన కళాశాల నుంచి, రచయిత తన కలం నుంచి, మహిళ తన ఇంటి గడప దాటి వీధిలోకి వచ్చి నిర్మించిన మహా ప్రజా ఉద్యమం. సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, వ్యక్తిగత సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం- ప్రతి దశలో ప్రజలే ప్రధాన శక్తి. బ్రిటిష్ సామ్రాజ్యం ఎంత శక్తివంతమైనదైనా, ప్రజా సంకల్పాన్ని జయించ లేకపోయింది. ఈ ఉద్యమం భారతదేశానికి ఒక గొప్ప రాజకీయ సంస్కృతిని కూడా నేర్పింది. ప్రజల భాగస్వామ్యం లేకుండా చరిత్ర మారదని నిరూపించింది.
యువతే ఉద్యమానికి ఊపిరి..
ప్రతి పోరాటానికి యువతే ఊపిరి. భారత జాతీయోద్యమం కూడా దీనికి మినహాయింపు కాదు. ఇరవైమూడేళ్ల వయసులోనే భగత్‌సింగ్ ఉరికొయ్యను ముద్దాడాడు. చంద్రశేఖర్ ఆజాద్ తనను తాను శత్రువుల చేతుల్లో పడనివ్వలేదు. ఖుదీరామ్ బోస్ నవ్వుతూ మరణశిక్షను స్వీకరించాడు. అల్లూరి సీతారామరాజు గిరిజనుల గుండెల్లో తిరుగుబాటు జ్వాలను రగిలించాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కొమరం భీం వంటి పోరాట యోధులు తమ ప్రాంతాల్లో స్వాతంత్ర్య జ్వాలను రగిలించారు. కనకలతా బరువా, ప్రీతిలతా వాడేదార్, అరుణా ఆసఫ్ అలీ వంటి యువ మహిళలు కూడా ఉద్యమానికి అగ్రభాగాన నిలిచారు. వారి వయసు చిన్నదే. కానీ వారి స్వప్నం పెద్దది. ఉద్యోగం, జీతం, వ్యక్తిగత భవిష్యత్తు కంటే దేశ భవిష్యత్తు వారికి ముఖ్యం. వారి చేతుల్లో మొబైల్ ఫోన్లు లేవు. సామాజిక మాధ్యమాలు లేవు. కానీ ఒక పిలుపుతో వేలమంది వీధుల్లోకి వచ్చేవారు. ఒక కరపత్రం ఒక జిల్లాను కదిలించేది. ఒక ప్రసంగం వేలాది మంది జీవితాలను మార్చేది. ఆ యువతకు దేశం ఒక భౌగోళిక సరిహద్దు కాదు. అది ఒక నైతిక బాధ్యత.
దేశంలో 1920-1940 వరకు కళాశాలలు కేవలం విద్యాసంస్థలు కాదు. అవి రాజకీయ చైతన్య కేంద్రాలు. విదేశీ వస్త్రాలను తగులబెట్టిన చేతులే పరీక్షల హాళ్లను బహిష్కరించాయి. జైళ్లే విశ్వవిద్యాలయాలుగా మారాయి. దేశం అనే ఆలోచన కోసం వ్యక్తిగత జీవితాలను త్యాగం చేయడం ఆ తరానికి సహజంగా అనిపించింది. వారి కల ఒకటే - భారతదేశం తన నిర్ణయాలు తానే తీసుకునే దేశంగా మారాలి. పేదరిక నిర్మూలన, భూసంస్కరణలు, సామాజిక సమానత్వం, కుల వివక్ష నిర్మూలన, అందరికీ విద్య, శాస్త్రీయ దృక్పథం, స్వదేశీ పరిశ్రమలు, వ్యవసాయ స్వావలంబన- ఇవన్నీ కలిసే "స్వరాజ్యం" అనే భావన. ఇవి లేకుండా జెండా మాత్రమే ఎగిరితే ఆ స్వాతంత్ర్యం అసంపూర్ణమే.

దేశ నిర్మాణం.. ఒక తరం కల
భారతదేశం 1950-1980 వరకు ప్రణాళికాబద్ధ అభివృద్ధి మార్గాన్ని ఎంచుకుంది. ప్రభుత్వరంగ పరిశ్రమలు, ఉక్కు కర్మాగారాలు, భారీ ఆనకట్టలు, విద్యుత్ ప్రాజెక్టులు, శాస్త్రీయ పరిశోధనా సంస్థలు, ప్రజారంగ బ్యాంకులు, వ్యవసాయ పరిశోధన కేంద్రాలు- ఇవి కేవలం నిర్మాణాలు కాదు; స్వతంత్ర భారతదేశం తన కాళ్లపై తాను నిలబడాలనే సంకల్పానికి ప్రతీకలు. భారత అంతరిక్ష పరిశోధన, అణుశక్తి, హరిత విప్లవం వంటి కార్యక్రమాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఆకలి, ఆహార కొరతతో పోరాడిన దేశం క్రమంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి వైపు అడుగులు వేసింది. అయితే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు అమల్లోకి వచ్చిన 1991 తర్వాత అభివృద్ధి అర్థం మారింది. అసమానతలు పెరిగాయి. నగరాలు విస్తరించాయి. గ్రామాలు వెనుకబడ్డాయి. కొద్దిమంది ప్రపంచ కుబేరులుగా మారగా, కోట్లాది మంది ఇప్పటికీ కఠోర పేదరికాన్ని అనుభవిస్తున్నారు. కనీస జీవన భద్రత కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఒక కొత్త ప్రశ్న ముందుకొస్తుంది. అభివృద్ధి అంటే కేవలం జీడీపీ పెరగడమేనా? లేక ప్రతి పౌరుడి జీవన ప్రమాణం మెరుగుపడటమా?
స్వరాజ్యం అంటే ఏమిటి?
స్వాతంత్ర్య ఉద్యమ నాయకులందరికీ ఒకే విధమైన ఆలోచనలు లేవు. గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని కలగన్నాడు. నెహ్రూ శాస్త్రీయ అభివృద్ధి, పారిశ్రామికీకరణను ప్రాధాన్యంగా చూశాడు. అంబేద్కర్ రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం కూడా అవసరమని నొక్కి చెప్పాడు. భగత్‌సింగ్ సామాజిక, ఆర్థిక దోపిడీ లేని భారతదేశాన్ని ఊహించాడు. ఆలోచనలు వేర్వేరు అయినా, వారి లక్ష్యం ఒక్కటే- భారతదేశం తన నిర్ణయాలను తానే తీసుకునే, ప్రతి పౌరుడు గౌరవంగా జీవించే దేశంగా ఎదగాలి. పేదరికం, కుల వివక్ష, నిరక్షరాస్యత, ఆకలి, అన్యాయం వంటి అంతర్గత సంకెళ్ల నుంచి కూడా విముక్తి పొందాలి. రెండువందల ఏళ్ల వలసపాలన దేశ ఆర్థికవ్యవస్థను, పరిశ్రమలను, విద్యను, వ్యవసాయాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసింది. స్వేచ్ఛ లభించినా, స్వయం సమృద్ధికి ఇంకా దూరంగానే ఉంది. అందుకే స్వాతంత్ర్యానంతర భారతదేశం ఎంచుకున్న మొదటి మార్గం స్వావలంబన. "మన అవసరాలను మనమే తీర్చుకోవాలి.. మన అభివృద్ధిని మనమే నిర్మించుకోవాలి" అనే ఆలోచనే దేశ నిర్మాణానికి పునాది అయింది.
స్వయం సమృద్ధి – నినాదమా? అవసరమా?
కోవిడ్ మహమ్మారి ప్రపంచానికి ఒక గొప్ప పాఠం నేర్పింది. ఔషధాలు, వైద్య పరికరాలు, సెమీకండక్టర్లు, ఆహార భద్రత, సరఫరా గొలుసులు- ఇవి పూర్తిగా విదేశాలపై ఆధారపడితే ఎంతటి సంక్షోభం ఏర్పడుతుందో ప్రపంచం ప్రత్యక్షంగా చూసింది. అందుకే మళ్లీ ‘‘వికసిత్ భారత్’’ , "ఆత్మనిర్భర్", "స్థానిక ఉత్పత్తి" వంటి భావనలు ప్రాధాన్యం పొందాయి. ‘‘వికసిత్ భారత్’’ అనే భావన కేవలం ఆర్థికాభివృద్ధికే పరిమితం కాదు. నాణ్యమైన విద్య, ఆరోగ్య భద్రత, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, రైతుకు భరోసా, ప్రతి పౌరుడికీ సమాన అవకాశాలు కల్పించే సమగ్ర అభివృద్ధే దాని అసలు లక్ష్యం. సమాజంలోని అట్టడుగు వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరినప్పుడే స్వాతంత్ర్యానికి నిజమైన అర్థం లభిస్తుంది. అయితే అభివృద్ధి అనేది కేవలం భారీ రహదారులు, ఎత్తైన భవనాలు, అధునాతన సాంకేతికతకు మాత్రమే కొలమానం కాదు. ఆకలి, నిరుద్యోగం, అసమానతలు, పర్యావరణ సంక్షోభం, సామాజిక వివక్ష, విద్యా–వైద్య రంగాల్లోని అసమాన అవకాశాలు వంటి సమస్యలను అధిగమించినప్పుడే నిజమైన వికసిత్ భారత్ సాకారమవుతుంది. అందువల్ల అభివృద్ధి అనే పదానికి సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలు, సమానత్వం, సుస్థిరత వంటి అంశాలు కూడా అంతే ముఖ్యమైనవి. స్వయం సమృద్ధి అంటే ప్రపంచం నుంచి వేరుపడటం కాదు. ప్రపంచంతో భాగస్వామ్యం చేస్తూనే, అత్యవసర రంగాల్లో దేశానికి స్వతంత్ర సామర్థ్యం కలిగి ఉండడం.
ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాల్లో భారతదేశం అమెరికాతో రక్షణ, సాంకేతికత, విద్య, పెట్టుబడులు, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు వంటి అనేక రంగాల్లో సహకారాన్ని పెంచుకుంటోంది. విదేశీ పెట్టుబడులు అవసరమే. కానీ దేశీయ పరిశ్రమలు బలహీనపడకూడదు. సాంకేతిక సహకారం కూడా అవసరమే. కానీ కీలక సాంకేతికతపై పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడకూడదు. రక్షణ భాగస్వామ్యం అవసరమే. కానీ విదేశాంగ స్వతంత్రత దెబ్బతినకూడదు. ఈ చర్చలు ప్రజాస్వామ్య సమాజంలో సహజమైనవే. ఎందుకంటే స్వాతంత్ర్యం అంటే కేవలం సరిహద్దులను కాపాడుకోవడమే కాదు; నిర్ణయాధికారాన్ని కాపాడుకోవడం కూడా.

జాతీయోద్యమం నుంచి జెన్.జెడ్ వరకు
చరిత్రలో ప్రతి తరం తన కాలాన్ని మార్చిన ఒక ప్రశ్నను అడిగింది. ఒక తరం "బ్రిటిష్ పాలన ఎందుకు?" అని ప్రశ్నిస్తే, మరో తరం "ఆకలి ఎందుకు?" అన్నది. ఇంకో తరం"అత్యవసర పరిస్థితి ఎందుకు?" అని ప్రశ్నించింది. ఇప్పుడు జెన్.జెడ్ తరం అడుగుతున్న ప్రశ్నలు కూడా అంతే తీవ్రమైనవి. పరీక్షా పత్రాలు ఎందుకు లీక్ అవుతున్నాయి?, "చదివినా ఉద్యోగం ఎందుకు లేదు?", "అభివృద్ధి జరుగుతుంటే అసమానత ఎందుకు పెరుగుతోంది?", "డేటా నాదైతే దాని నియంత్రణ ఎవరిది?", "సాంకేతికత మనిషిని విముక్తి చేస్తుందా? లేక మరింత నియంత్రిస్తుందా?"- అనేక ప్రశ్నలు జెన్.జెడ్ లేవనెత్తుతోంది. అప్పటికీ ఇప్పటికీ ప్రశ్నల స్వభావంలో మార్పు వుండొచ్చు. కానీ ప్రశ్నించే హక్కు మాత్రం ప్రజాస్వామ్యానికి ప్రాణం.
స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో వార్త ఒక గ్రామానికి చేరుకోవడానికి రోజులు పట్టేది. నేడు ఒక సంఘటన ప్రపంచమంతా కొన్ని క్షణాల్లో చేరిపోతోంది. ఈ తరం పుట్టుకతోనే ఇంటర్నెట్‌ను చూసింది. స్మార్ట్‌ఫోన్ వారి చేతిలో కేవలం ఒక పరికరం కాదు; అది పాఠశాల, ఒక గ్రంథాలయం, వార్తాపత్రిక, వేదిక, ఉద్యమం, ఉపాధి, ఆయుధం- అన్నీ. ఒకప్పుడు ఉద్యమం అంటే వీధిలో వేలమంది కనిపించేవారు. ఇప్పుడు ఒక హ్యాష్‌ట్యాగ్ కూడా లక్షల మందిని కలుపుతుంది. ఒకప్పుడు గోడపత్రికలు ప్రజలను ఆలోచింపజేసేవి. ఇప్పుడు ఒక వీడియో కోట్ల మందిని ప్రభావితం చేస్తోంది. అయితే ప్రజాస్వామ్యం కేవలం 'లైక్'లు, 'షేర్'లతో బలపడదు. అది ప్రజల భాగస్వామ్యంతో, చర్చలతో, సంఘటిత కృషితో బలపడుతుంది. సామాజిక మాధ్యమాలు ఉద్యమాలకు ఊపిరి ఇవ్వగలవు. కానీ ఉద్యమాలకు దిశను ఇచ్చేది ఆలోచనే.
విద్య.. నిరుద్యోగం
నేడు విద్య అనేక కుటుంబాలకు భారీ ఆర్థిక భారంగా మారుతోంది. దేశంలో విద్య ఒక హక్కుగా వుండాలి. కానీ ప్రభుత్వాలు దీని నుంచి తప్పుకుంటున్నాయి. పిల్లలకు మంచి విద్య చెప్పించలేక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ఉద్యోగం కోసం మరో పోరాటం తప్పడంలేదు. విద్యా సంస్థలు పెరిగాయి. డిగ్రీలు పెరిగాయి. సాంకేతిక నైపుణ్యాలూ పెరిగాయి. కానీ అదే స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరిగాయా? పోటీ పరీక్షల కోసం సంవత్సరాల తరబడి సిద్ధమవుతున్న లక్షలాది యువకులు, నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు, తాత్కాలిక ఉద్యోగాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న యువత- ఇవి గణాంకాలు కాదు; ఒక తరం మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తున్న వాస్తవాలు. దానికి అతిపెద్ద ఉదాహరణే జెన్.జి ఉద్యమం.
దేశభక్తి.. నినాదం కాదు, నిబద్ధత
ఇటీవలి కాలంలో దేశభక్తి గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. కానీ నిజమైన దేశభక్తి కేవలం నినాదాల్లో ఉండదు. దేశభక్తి అంటే- రాజ్యాంగాన్ని గౌరవించడం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం. ప్రజల సంపదను కాపాడడం. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, భిన్నత్వాన్ని గౌరవించడం, పేదరికాన్ని నిర్మూలించడం. అంతేకాదు, ప్రశ్నించే హక్కును కూడా గౌరవించినప్పుడే ప్రజాస్వామ్యం పరిపక్వమవుతుంది. అదే స్వాతంత్ర్యానికి నిజమైన అర్థం. నేడు ఆ హక్కులు అణచివేయ బడుతున్నాయనేది జగమెరిగిన సత్యం.
కొత్త వలసవాదం.. కనిపించని రూపాలు
ఒకప్పుడు వలసవాదం తుపాకీతో వచ్చేది. ఇప్పుడు అది మార్కెట్, డేటా, సాంకేతికత, మేధో సంపత్తి హక్కులు, డిజిటల్ వేదికలు, ఆల్గోరిథంల రూపంలో కూడా ప్రత్యక్షమవుతుందని అనేక మంది ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాట. ప్రపంచంలోని అతిపెద్ద సాంకేతిక సంస్థలు మన సమాచారాన్ని నిల్వ చేస్తాయి. మన వినియోగ అలవాట్లను విశ్లేషిస్తాయి. మన అభిరుచులను ప్రభావితం చేస్తాయి. డేటా కొత్త ‘చమురు’ అని చెప్పే కాలంలో, డేటాపై నియంత్రణ కూడా ఒక రకమైన శక్తిగా మారింది. అందుకే నేటి స్వాతంత్ర్యం అంటే భూభాగాన్ని కాపాడుకోవడమే కాదు; డేటా స్వాధీనం, సాంకేతిక స్వావలంబన, పరిశోధనా సామర్థ్యం, జ్ఞాన ఉత్పత్తి వంటి రంగాల్లోనూ బలంగా నిలబడటం. మన విజ్ఞానాన్ని కాపాడుకోవడం, విస్తరింపజేయడం అవసరం.

అభివృద్ధి.. గణాంకాల్లో కాదు
దేశ ఆర్థికవ్యవస్థ ఎదగాలి. పరిశ్రమలు రావాలి. విదేశీ పెట్టుబడులు, ప్రపంచంతో భాగస్వామ్యం కూడా అవసరమే. కానీ ఒక ప్రశ్న ఎప్పుడూ మన ముందుండాలి- ‘అట్టడుగున పడి వున్న కథలన్నీ/ కావాలిప్పుడు/ దాచేస్తే దాగని సత్యం’ అంటాడు మహాకవి శ్రీశ్రీ. ఈ అభివృద్ధి అట్టడుగు వర్గాల జీవితాలను ఏం మార్చింది? రైతుల ఆదాయం పెరిగిందా? కార్మికుల జీవితానిక భద్రత, యువతకు ఉపాధి, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోందా? ఆదివాసీ, దళిత, మైనారిటీ, మహిళ, వికలాంగులు- వీరందరికీ సమాన అవకాశాలు లభిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు సానుకూల సమాధానాలు వచ్చినప్పుడే దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నట్లు లెక్క.
మన పూర్వీకులు మనకు ఒక స్వేచ్ఛా దేశాన్ని అందించారు. ఇప్పుడు ఆ దేశానికి స్వయం సమృద్ధిని, సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగ విలువలను, శాస్త్రీయ దృక్పథాన్ని, మానవ గౌరవాన్ని కాపాడటం మన బాధ్యత. ప్రపంచంతో స్నేహం చేయాలి; కానీ మన నిర్ణయాలను మనమే తీసుకునే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. సాంకేతికతను ఆహ్వానించాలి; కానీ మన స్వేచ్ఛను దానికి తాకట్టు పెట్టకూడదు. అభివృద్ధిని కోరుకోవాలి; కానీ అది చిట్టచివరి మనిషి జీవితంలోనూ వెలుగులు నింపినప్పుడే దానికి అర్థం ఉంటుంది. స్వాతంత్ర్యాన్ని కాపాడేది సరిహద్దుల్లో నిలిచే సైనికుడు మాత్రమే కాదు. నిజాన్ని ప్రశ్నించే విద్యార్థి, నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయుడు, పొలంలో చెమటోడ్చే రైతు, యంత్రం ముందు నిలిచే కార్మికుడు, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే యువత.. వీరందరూ ఆ స్వాతంత్ర్యానికి కాపలాదారులే. స్వాతంత్ర్యం అనేది ఒక గెలుపుతో ముగిసిపోయే యుద్ధం కాదు. ప్రతితరం తన కాలంలోని ఆధిపత్యాలను ఎదుర్కొని, మళ్లీ సాధించాల్సిన నిరంతర ప్రక్రియ. అప్పటి యువత బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసింది. ఇప్పటి యువత అసమానతను, నిరుద్యోగాన్ని, లీకేజీలను, ఇతర దేశాలకు దాసోహమనే అభివృద్ధి నమూనాలను, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ధోరణులను ప్రశ్నిస్తోంది. ‘సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం / సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం / ఏకదీక్షతో గమ్యం చేరిననాడే / లోకానికి మన భారతదేశం అందించునులే శుభసంకేతం..’ అంటారు శ్రీశ్రీ. ఈ జెండా నీడలో నిలబడ్డ ప్రతి మనిషి గౌరవంగా, స్వేచ్ఛగా, సమానత్వంతో జీవించగలిగినప్పుడే భారతదేశం నిజంగా స్వతంత్ర దేశమని చెప్పగలం.








కామెంట్‌లు (0)