నీళ్లు పట్టుకుంటుండగా దూసుకొచ్చిన టెంపో
దంపతులతో సహా ముగ్గురు దుర్మరణం
ఐదుగురికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి- శాంతిపురం (చిత్తూరు జిల్లా): టెంపో ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లి హైవేపై సోమవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరల ప్రకారం.. శాంతిపురం మండలం కడపల్లి గ్రామం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న వాటర్ ట్యాంకర్ నుంచి స్థానికులు నీళ్లు పట్టుకుంటున్నారు. అదే సమయంలో ఒక టెంపో వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పి వాటర్ ట్యాంకర్‌ను, పక్కన వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై వస్తున్న శివపురం గ్రామానికి చెందిన సుందరప్ప (60) ఆయన భార్య ముని వెంకటమ్మ (50) అక్కడిక్కడే మృతి చెందారు. ట్యాంక్ పక్కన నిలబడి ఉన్న బాలుడు సాత్విక్ (5)తో పాటు నీళ్లు పట్టుకుంటున్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని స్థానికుల సహాయంతో కుప్పంలోని పిఇఎస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సాత్విక్ మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. టెంపో డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని, అతడిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టామని వారు తెలిపారు.







కామెంట్‌లు (0)