పిజిఆర్ ఎస్ కు పోటెత్తిన మహిళలు
ప్రజాశక్తి- యంత్రాంగం : సాంకేతిక కారణాలతో ‘తల్లికి వందనం’లో ప్రభుత్వం కోతలు పెట్టింది. ఆధార్ ఇ-కెవైసి లోపాలు, గృహ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటడం, బ్యాంకు ఖాతాలకు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ కాకపోవడం, విద్యార్థుల వివరాలను నమోదు కాకపోవడం, ఇన్ కం ట్యాక్స్ రిటర్న్ వంటి పలు రకాల కారణాలు చూపుతూ లబ్ధిదారులను కుదించింది. దీంతో పిజి ఆర్ ఎస్ కు లబ్ధిదారులు పోటెత్తారు. ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి తమ అర్జీలను సమర్పించారు. సాంకేతిక లోపాలుంటే సరిచేసుకోవడానికి ఆగస్టు మూడు వరకు గడువు విధించారు. ఆగస్టు నాలుగు నుండి పది వరకు సచివాలయ సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయి పున:పరిశీలన జరిపి, అర్హత సాధించిన లబ్ధిదారులకు ఆగస్టు 30న సప్లిమెంటరీ జాబితా ద్వారా నిధులను పూర్తి స్థాయిలో జమ చేయనున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. హౌస్ మ్యాపింగ్ సమస్యలతో తమకు తల్లికి వందనం డబ్బులు అందలేదని విజయనగరం కలెక్టరేట్ కు లబ్ధిదారులు పోటెత్తారు. తమకు ఆధార్ కార్డులు ఇవ్వాలని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలోని యానాదులు గుంటూరు కలెక్టరేట్‌లో అర్జీలిచ్చారు. ఆధార్ కార్డులేని కారణంగా పాఠశాలల్లో పిల్లలను చేర్చలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయనగరం జిల్లాల్లో భూ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ భూములు ఆక్రమిస్తున్నారని, రికార్డులు తారుమారు చేస్తున్నారని, తప్పులను సరిచేయడం లేదని ఇలా పలు సమస్యలతో ప్రతి వారం వందల సంఖ్యలో భూ సమస్యలపై ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు అందుతున్నాయి. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో దాదాపు సగం ఈ సమస్యలపైనే అర్జీలు వచ్చాయి. 199 వినతుల్లో 97 రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉండడం ఇందుకు అద్దం పడుతోంది.
వంగర మండలం మరువాడ గ్రామానికి చెందిన రైతు శింగిరెడ్డి శ్రీనివాసరావు… భూ రీసర్వేలో తన భూమి వివరాల్లో జరిగిన తప్పిదాలను సరిచేయాలని కోరుతూ రెండోసారి వచ్చారు. అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా, తప్పిదాలను గుర్తించినప్పటికీ సవరణలు చేయలేదంటూ డిఆర్ఒ, ఇతర అధికారుల ఎదుట వాపోయారు. పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామానికి చెందిన పైల శ్రీనివాసరావు, పైల కొండ సహా పది కుటుంబాలు కలెక్టరేట్ కు వచ్చాయి. తాము సర్వే నెంబర్ 4/21, 6/32లోని 4.52 ఎకరాల భూమిలో తమ తాత తండ్రుల నుంచి (సుమారు 70 ఏళ్లగా) పంటలు సాగుచేసుకుంటూ జీవనాధారం పొందుతున్నామని, తాజాగా తమ గ్రామానికి చెందిన కొవిడి హరిబాబు అనే వ్యక్తి ఆక్రమించి, తమ పొట్టకొట్టేందుకు చూస్తున్నారని వీరంతా అధికారుల ఎదుట వాపోయారు. రాజాం మండలం అంతకాపల్లి గ్రామానికి చెందిన గార శివనాయుడు...తన భూ రికార్డుల్లో జరిగిన అక్రమ మార్పులపై ఫిర్యాదు చేశారు. తాను 50 సెంట్లు మాత్రమే విక్రయించగా, మరో ఎనిమిది సెంట్లను కూడా తన అనుమతి లేకుండా రియల్ ఎస్టేట్ సంస్థకు అధికారులు బదిలీ చేశారని ఆరోపించారు. ఇలా భూ సమస్యలపై ప్రతి వారం రైతులు వచ్చి అర్జీలు ఇస్తున్నప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.







కామెంట్‌లు (0)