ఆధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ బోర్డు సమావేశం నిర్ణయం
ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు జిల్లా) : రాష్ట్రంలోని 36 కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లను పంద్రాగస్టు నాటికి ప్రారంభించాలని ఆధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ బోర్డు సమావేశం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ 22వ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం గుంటూరు జిల్లా మంగళగిరిలోని అకాడమీ ప్రధాన కార్యాలయంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షిబ్లీ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశానికి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీ/కమిషనర్ చిత్తూరి శ్రీధర్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ సెక్రటరీ జంపాని శివయ్య, ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్, ఉర్దూ అకాడమీ బోర్డు సభ్యులు మెహబూబ్ బాషా, ఉర్దూ అకాడమీ డైరెక్టర్/సెక్రటరీ మహమ్మద్ నిజాముద్దీన్ హాజరై అజెండాలోని అంశాలను చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉర్దూ భాషాభివృద్ధి, మైనారిటీ యువతకు నైపుణ్యాభివృద్ధి, కంప్యూటర్ శిక్షణా కేంద్రాల బలోపేతం, ఉర్దూ గ్రంథాలయాల అభివృద్ధి, సేవా నియమావళి, కారుణ్య నియామకాలు, ఉర్దూ సాహిత్య ప్రచురణలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన తీర్మానాలను బోర్డు ఆమోదించింది. ఉర్దూ ఘర్-కమ్-షాదీఖానాల సమర్థవంతమైన నిర్వహణ, ఆదాయ వృద్ధి, ఆస్తుల పరిరక్షణ, ఆర్థిక స్వావలంబన, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు జిఒలో అవసరమైన సవరణల కోసం ప్రత్యేక ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాలని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్రంలోని 36 కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ల కోసం కంప్యూటర్ వ్యవస్థల కొనుగోలు నిమిత్తం ఎపి టిఎస్‌కు చెల్లించిన మొత్తం నిధులు విడుదలైనప్పటికీ, వివిధ కారణాలతో సరఫరా, ఏర్పాటు ఆలస్యం కావడంపై బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరఫరా చేయని పరికరాలకు సంబంధించిన మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని ఎపి టిఎస్‌కు లేఖ రాయాలని, అవసరమైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 36 కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లలో ఆగస్టు 15వ తేదీన ఎడిసిఎ, మల్టీ లాంగ్వేజ్ డిటిపి కోర్సులను తప్పనిసరిగా ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించడం, సంబంధిత శాఖలతో సమన్వయం చేయడం, నిర్ణయాలను త్వరితగతిన అమలు చేయడానికి డైరెక్టర్/సెక్రటరీకి అధికారాలు అప్పగిస్తూ బోర్డు నిర్ణయించింది.








కామెంట్‌లు (0)