ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సాగర్ నిండకపోతే ఇబ్బందే

1 రోజు క్రితం

Nimmala Ramanaidu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 08:59 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- టెలీకాన్ఫరెన్స్‌‌లో మంత్రి నిమ్మల రామానాయుడు

- రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచన

- ఇరిగేషన్‌ అధికారుల సెలవులు రద్దు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నాగార్జునసాగర్‌ ‌రిజర్వాయర్‌‌కు ఈ సీజన్లో నీరు రాకపోతే 2027 వరకూ తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాలని, పులించింతల, పట్టిసీమ నీటిని తాగునీటి కోసం భద్రపరుచుకోవాలని, గోదావరిలోనూ నీటి లభ్యత తక్కువగా ఉందని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎల్‌‌నినో నేపథ్యంలో నీటి పరిస్థితులపై శనివారం గోదావరి, కృష్ణా డెల్టా పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోల‌వ‌రం కుడి ప్రధాన కాలువ ద్వారా వ‌చ్చే నీటిని దుర్వినియోగం కాకుండా, కృష్ణా డెల్టాకు అందేలా అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టాలని ఆదేశించారు. గోదావ‌రి, కృష్ణా డెల్టాల్లో 10 జిల్లాల క‌లెక్ట‌ర్లు ఆధ్వ‌ర్యంలో ఇరిగేష‌న్ అడ్వైజ‌రీ బోర్డ్ మీటింగ్ లు నిర్వ‌హించి ప్ర‌స్తుత ప‌రిస్దితుల‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని సూచించారు. ఎల్ నినో క్లిష్ట స‌మ‌యంలో ఇరిగేష‌న్ శాఖ ల పైస్థాయి నుండి కింది స్థాయి వ‌ర‌కు అధికారులు అంద‌రూ అందుబాటులో ఉండేలా సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా డెల్టా ప‌రిధిలో నాగార్జున సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ కు నీళ్ళు నిండకుండా, వ‌రిసాగు చేస్తే భవిష్యత్ లో పంట మొత్తం నష్టపోతుందని హెచ్చరించారు. ప‌ట్టిసీమ నుండి వ‌చ్చేనీటిని కేవ‌లం తాగు నీటి అవ‌స‌రాల‌కు, ఆరుత‌డి పంట‌ల‌కు మాత్ర‌మే వినియోగించాలని తెలిపారు. నాగార్జున సాగర్ కు ఈ సీజన్ లో నీళ్ళు రాకపోతే 2027 జూన్ వరకు పులిచింతల, పట్టిసీమ నీళ్లను తాగు నీటికే భద్రపరచుకోవాలని తెలిపారు. రైతుల‌ ప్ర‌యోజ‌నాల‌ను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవిన్యూ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలని సూచించారు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా సీలేరు జ‌లాల‌ను గోదావ‌రి డెల్టా ఖ‌రీఫ్ అవ‌స‌రాల కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. పుష్క‌ర కాలువ ఏలేరు వ్య‌వ‌స్ధ‌ ద్వారా వచ్చే నీటిని తాగునీటి అవ‌స‌రాల‌కు, ఆరుత‌డి పంట‌ల‌కే వినియోగించాలని, వాటి ద్వారా తూర్పుగోదావ‌రి, కాకినాడ, విశాఖ‌ జిల్లాల్లో సుమారు 55 ల‌క్ష‌లు మంది ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందించాల్సి ఉందని చెప్పారు. గోదావ‌రి డెల్టా ఆయ‌క‌ట్టు రైతులు సాగు కొన‌సాగించేందుకు, అన్ని జాగ్ర‌త్త చ‌ర్య‌లూ తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి సూచించారని పేర్కొన్నారు. డెల్టా లో మెర‌క ప్రాంత రైతులు ఆరుతుడి పంట‌ల‌కే ప్రాధాన్య‌త ఇవ్వాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, శాస్త్రీయ ప‌ద్ద‌తిలో వినియోగించి ప్ర‌తి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గోదావ‌రి సెంట్ర‌ల్, ఈస్ట‌ర్న్, వెస్టర్న్ డెల్టాల‌ ప్రాధాన కాలువ‌ల్లో నీటి ప్ర‌వాహానికి అడ్డంకులు లేకుండా వీడ్ తొలగించాలని తెలిపారు. ఖ‌రీఫ్ పంట పూర్త‌య్యే వ‌ర‌కు ఓఅండ్ఎం ప‌నులు కొన‌సాగిస్తూ, రైతులు, సాగునీటి సంఘాల స‌హ‌కారంతో ఆయ‌క‌ట్టుకు సాగునీటిని అందించాలని సూచించారు. టెలీ కాన్ఫ‌రెన్స్ లో ఇరిగేష‌న్ స‌ల‌హాదారు వెంక‌టేశ్వ‌ర‌రావు, ఈఎన్సీ న‌ర‌సింహ‌మూర్తి. తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్