సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హైకోర్టు ముందుకు కిడ్నాప్‌‌కు గురైన బాలిక

50 నిమిషాల క్రితం

ap ghi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 12:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి: షేక్ జాన్ సైదా చేతిలో కిడ్నాప్‌కు గురైన 15 ఏళ్ల బాలికను పోలీసులు సోమవారం హైకోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారణ సందర్భంగా పోలీసులను ధర్మాసనం పలు ప్రశ్నలు వేసింది. జూన్ 9న జాన్ సైదా బాలికను కిడ్నాప్ చేసినప్పటి నుంచి ఆమె ఆచూకీ కోసం తీసుకున్న చర్యలేమిటో పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని డిజిపి హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించింది. బాలిక కిడ్నాప్ వ్యవహారం చిన్న విషయం కాదని పేర్కొంది. నిందితుడు జాన్ సైదా, బాలిక ఇంతకాలం ఎక్కడ ఉన్నారు? బాలికను తీసుకెళ్లేందుకు సహకరించినవారు ఎవరు? వారికి ఎవరు ఆశ్రయం కల్పించారు? బాలిక మైనర్ అని తెలిసినా లాడ్జీల్లో గదులు ఎలా ఇచ్చారు? నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా పూర్తి వివరాలు సమర్పించాలని డిజిపిని ఆదేశించింది. బాలిక తన తండ్రితో ఇంటికి వెళ్తానని చెప్పడంతో అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. బాలికకు వైద్య పరీక్షల విషయంలో సహకరించాలని తండ్రికి సూచించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ ఆలపాటి గిరిధర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్‌కు వెళ్లి కనిపించకుండా పోయిందని గుంటూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి జూన్ 9న పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన షేక్ జాన్ సైదా తన కుమార్తెను ట్రాప్ చేసి తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆచూకీ తెలియకపోవడంతో బాలిక తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణలో పోలీసుల దర్యాప్తు తీరుపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, డిజిపి హాజరుకు ఆదేశిస్తామని హెచ్చరించింది. ఎస్‌‌పి అభ్యర్థన మేరకు విచారణ వాయిదా పడటంతో డిజిపి సిట్ ఏర్పాటు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్