ప్రాజెక్టును ప్రారంభించనున్న చంద్రబాబు
శంకుస్థాపన చేసిన 30 ఏళ్లకు నీటి విడుదల
ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో, మార్కాపురం, పెద్దదోర్నాల : వెలిగొండ ప్రాజెక్టు కృష్ణా జలాలతో నిండబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. 30 ఏళ్ల నుంచీ మూడు జిల్లాల రైతులు ఎదురుచూస్తున్న తరుణమిది. శ్రీశైలం జలాశయం నుంచి రెండు సొరంగాల ద్వారా వెలిగొండ జలాశయానికి నీళ్లు రానున్నాయి. పది టిఎంసిల నీటిని ప్రస్తుతం నిల్వ చేయనున్నారు. జూన్ నాటికే ప్రారంభించాల్సి ఉండగా, పనులు పూర్తి కాలేదు. నిర్వాసితులకు ఇటీవల వరకూ పరిహారం, ప్యాకేజీలు ఇవ్వలేదు. కృష్టా నదికి హఠాత్తుగా వరద నీరు రావడంతో పాటు వెలిగొండ సొరంగాలు ఉన్న కొల్లంవాగు ప్రాంతానికి నీరు చేరింది. వరద నీరు పెరిగింది. దీంతో, నీటిని విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిర్వాసితులకు దశల వారీగా పరిహారం, ప్యాకేజీలు అందజేసింది. ఇంకా మరికొందరి పేర్లు నమోదు చేయనందున వారికి అందలేదు. నిర్వాసితుల ఆందోళనకు తలొగ్గి 18 ఏళ్లు నిండిన యువతకు రూ.2 లక్షల చొప్పున ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించింది. నిర్వాసితులకు సమయం ఇవ్వకుండా గ్రామాలను ఖాళీ చేయాలని వారిపై ఒత్తిడి చేసింది. దీంతో, అయిష్టంగా తరలిపోయారు. ముందస్తు వ్యూహం లేకుండా ప్రభుత్వం వ్యవహరించింది. పైగా, ప్రాజెక్టును అడ్డుకోవద్దనే ప్రచారం తెరపైకి తెచ్చింది. నిర్వాసితుల పక్షాన సిపిఎం చేసిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి నిర్వాసితులకు పరిహారాల అందజేత వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టు కోసం కమ్యూనిస్టు పార్టీలు 1960 దశకంలోనే ఉద్యమిం చాయి. సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా వెలిగొండ పాలకుల అజెండాలో చేరింది. అప్పట్లో ఎన్‌టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ కమ్యూనిస్టు పార్టీల ఎమ్మెల్యేలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత 1996లో ప్రస్తుత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రారంభంలో అంచనా రూ.950 కోట్లు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి సరిగ్గా 30 ఏళ్లు పట్టింది. సకాలంలో ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో అంచనా వ్యయం పెరిగి రూ.10 వేల కోట్లకు చేరుకుంది. శంకుస్థాపన చేశాక పదేళ్ల వరకూ పనులు ప్రారంభం కాలేదు. 2005లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పనులు మొదలు పెట్టారు. జర్మనీ నుంచీ బోరింగు మిషన్లు తెచ్చి సొరంగాల పనులు చేపట్టారు. రెండో సొరంగం కోసం అప్పట్లో సిపిఎం నేత బివి.రాఘవులు... పామూరు నుంచీ దోర్నాల వరకూ యాత్ర నిర్వహించారు. దీంతో, ప్రభుత్వం రెండో సొరంగం పనులు చేపట్టింది. అప్పటి నుంచీ పనులు ఆగుతూ.. సాగుతూ వచ్చాయి. గత వైసిపి ప్రభుత్వ హయాంలో రెండు సొరంగాల పనులు పూర్తి కాకుండానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. నిర్వాసితులను గాలికి వదిలేశారు. టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలుసార్లు ఈ ప్రాజెక్టును సందర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తికి ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఫీడర్ కాలువ పనులు, సొరంగాల్లో మిగిలిన పనులను పూర్తి చేయించారు.
మిగులు జలాలపైనే ఆధారం
వెలిగొండ ప్రాజెక్టు మిగులు జలాలపైనే ఆధారపడింది. శ్రీశైలం వరద నీరు 43 టిఎంసిలు దీనికి కేటాయించారు. శ్రీశైలం, సాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండాక గేట్లు ఎత్తేయకుండా వరద నీటిని వెలిగొండ ప్రాజెక్టుకు మళ్లిస్తారు. రోజుకు ఒక టిఎంసి చొప్పున రెండు సొరంగాల ద్వారా నీళ్లు రానున్నాయి. ఏటా ఎంత వరద నీరు వస్తుందో అంచనా వేశారు. 4.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల జనాభాకు తాగునీరు అందించాలనేది లక్ష్యం. ఇప్పుడు మొదటి దశలో 1.19 లక్షల ఎకరాలకు సాగు నీరు, నాలుగు లక్షల జనాభాకు తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో పంపిణీ కాలువల వ్యవస్థను పూర్తి చేయాల్సి ఉంది. ఉమ్మడి ప్రకాశంతోపాటు నెల్లూరు, వైఎస్‌ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించేందుకు పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం జలాశయానికి పది టిఎంసిల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రాజెక్టు నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో భూగర్భజలాలు పెరుగుతాయని, బోర్లలోనూ నీటిమట్టం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.
వెలిగొండ ట్రయల్ రన్ విజయవంతం
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ఆదివారం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు కృష్ణా నది సమీపాన కొల్లం వాగు వద్ద నిర్మించిన హెడ్ రెగ్యులేటర్ నుండి స్వల్పంగా కృష్ణా జలాలను విడుదల చేశారు. సాయంత్రం మూడున్నర గంటలకు సొరంగ మార్గాల నుండి కృష్ణా జలాలు బయటకు వచ్చాయి. సొరంగాల నుండి 4.2 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన క్రాస్ రెగ్యులేటర్ వరకు నీటిని సాగనంపారు. దీంతో వెలుగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైంది. ట్రయల్ రన్ ఏర్పాట్లను వెలిగొండ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిండి కృష్ణారెడ్డి పర్యవేక్షించారు.







కామెంట్‌లు (0)