ఎన్‌సిఎల్‌టి ఉత్తర్వులపై బ్యాంకులు
న్యూఢిల్లీ : ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకులు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా ప్రక్రియపై వివాదం కొనసాగుతోంది. రూ.22,006 కోట్ల క్లెయిమ్‌నకు గానూ రూ.6.5 కోట్లు మాత్రమే చెల్లించేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) అనుమతించడంపై రుణాలిచ్చిన బ్యాంకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రుణ పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలిపిన క్రెడిటర్లకు సుభాష్ కుటుంబంతో సంబంధం ఉందని విమర్శిస్తున్నాయి. సుభాష్ చంద్రపై దాఖలైన వ్యక్తిగత దివాలా ప్రక్రియలో భాగంగా క్రెడిటర్లంతా కలిసి రూ.22,006.57 కోట్లు క్లెయిమ్ చేయగా.. కేవలం రూ.6.5 కోట్లు చెల్లించే పరిష్కార ప్రణాళికకు ఎన్‌సిఎల్‌టి ఆమోదం తెలిపింది. ఈ ప్రణాళికకు 80.81 శాతం క్రెడిటర్ల నుంచి ఆమోదం లభించడం గమనార్హం. ఇందులో సుభాష్ చంద్ర కుటుంబంతో సంబంధం ఉన్న ఐదు సంస్థలు రుణదాతల కమిటీలో 61.78 శాతం ఓటింగ్ వాటాను కలిగి ఉన్నాయని, ఈ ప్రణాళిక ఆమోదించడంలో కీలక పాత్ర పోషించాయని బ్యాంకులు చెబుతున్నాయి.
వీణా ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డైరెక్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వరల్డ్ క్రెస్ట్ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పి, లెమనేడ్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పి, కార్ప్‌కాల్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పి కంపెనీలకు అధిక ఓటింగ్ వాటా ఉండడంతో ఇది సాధ్యమైందని బ్యాంకులు పేర్కొంటున్నాయి. వీణా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది సుభాష్ చంద్ర సుభాష్ చంద్ర సోదరుడి భార్య సుశీలాదేవి గోయల్ నిర్వహిస్తున్నారని, డైరెక్ట్‌మీడియా, వెంచర్స్, వరల్డ్ క్రెస్ట్ కూడా వాటి అనుబంధ సంస్థలని పేర్కొంటున్నాయి.
దివాలా ప్రక్రియ నిబంధనల ప్రకారం అనుబంధ సంస్థలకు ఓటింగ్ హక్కులు ఉండకూడదని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిబిఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ వాదించాయి. దీనిపై ఎన్‌సిఎల్‌టి బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో కేసు మూడో సభ్యుడైన నీలేష్ శర్మ వద్దకు చేరింది. రుణగ్రహీతకు ప్రత్యక్షంగా 51 శాతం కంటే ఎక్కువ వాటా లేదా బోర్డు నియంత్రణ ఉంటేనే అనుబంధ సంస్థగా పరిగణించవచ్చని పేర్కొంటూ బ్యాంకుల అభ్యంతరాలను తిరస్కరించి, పరిష్కార ప్రణాళికకు ఆయన ఆమోదం తెలిపారు.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బ్యాంకులు
రుణంలో మొత్తం 3.2 శాతం వాటా కలిగిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఎన్‌సిఎల్‌టి ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళతామని పేర్కొంది. ప్రభుత్వరంగ బ్యాంకులైన కెనరా బ్యాంకు (1.60 శాతం), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.76 శాతం), ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ (6.09 శాతం) కూడా ఈ ప్రణాళికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాము కూడా అప్పీల్‌కు వెళతామని ప్రకటించాయి.







కామెంట్‌లు (0)