ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకరెంటు పోయింది.. నీట్‌ పిజి నిలిచింది

1 గంట క్రితం

jaipurneet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 12:39 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • మళ్లీ నిర్వహిస్తామన్న అధికారులు

  • డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఘోర వైఫల్యం

జైపూర్‌ : పరీక్ష పత్రాల లీకేజి, పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఇటీవల విద్యార్థులు, యువత చేస్తున్న నిరసనలు, పరీక్షా విధానాల్లో మరింత జవాబుదారీతనం కోసం వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఆదివారం జరిగిన నీట్ పిజి-2026 పరీక్షలో మరో వైఫల్యం బయటపడింది. డబుల్‌ ఇంజన్‌ ‌సర్కార్‌ ‌మరోసారి నిర్లక్ష్యంగా నీట్ పరీక్ష నిర్వహించింది. జైపూర్‌లో రెండు పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో 2,445 మంది విద్యార్థులు పరీక్ష‍ రాయలేకపోయారు. వారికి సెప్టెంబర్ 5న తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌‌బిఇఎంఎస్‌) ప్రకటించింది. సుమారు 10 రోజుల క్రితం జరిగిన ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ సమయంలో కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. మధ్యప్రదేశ్‌లో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పరీక్షపత్రం 40 లక్షలకు అమ్మేసిన ఉదంతం వెలుగులోకి రావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. కీలకమైన పరీక్షల నిర్వహణ పట్ల కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ యుజి పరీక్షపత్రం లీకేజితో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో యువత పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం, చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయినా పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం కొనసాగుతూనే వుందని ఈ ఘటన మరోసారి రుజువుచేసింది.

పదే పదే విద్యుత్ అంతరాయం..

రాజస్థాన్‌లోని జైపూర్‌లో గల ఐఒఎన్ డిజిటల్ జోన్ ఐడిజెడ్ సితాపుర కేంద్రాలలో (టిసి నెం. 41682, 41683) 2,445 మంది విద్యార్థులు పిజి పరీక్షకు హాజరయ్యారు. ఈ రెండు కేంద్రాల్లో పదేపదే విద్యుత్ కు అంతరాయం కలగడంతో కంప్యూటర్‌‌లు షట్‌డౌన్‌ కావడంతో విద్యార్థులు పరీక్ష పూర్తి చేయలేకపోయారు. ఈ సమస్యకు పరీక్ష నిర్వహణ సంస్థ అయిన టిసిఎస్ లిమిటెడ్ కారణమని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. “దేశవ్యాప్తంగా అత్యధిక శాతం అభ్యర్థులు పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, పరీక్ష నిర్వహణ సంస్థ అయిన మెస్సర్స్ టిసిఎస్ లిమిటెడ్ కారణంగా, పరీక్షా కేంద్రాల్లో అంతర్గత విద్యుత్ సరఫరా సమస్యల వల్ల 2,445 మంది అభ్యర్థులకు పరీక్ష పూర్తి కాలేదు” అని ఆ ప్రకటన తెలిపింది. ఈ అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తూ, వారికి నీట్ పిజి` 2026 పరీక్షకు హాజర య్యేందుకు న్యాయమైన, సమానమైన అవకాశం కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అధ్యక్షుడు డాక్టర్ అభిజత్ షెత్ తెలిపారు.

36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 349 నగరాల్లోని 1,111 కేంద్రాల్లో నీట్-పిజి పరీక్ష నిర్వహించామని, పేపర్ లీక్‌లు, ప్రశ్నపత్రాల లీక్‌లు, హ్యాకింగ్ లేదా సైబర్ క్రైమ్‌కు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులు అందలేదని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అధ్యక్షుడు డాక్టర్ అభిజత్ షెత్ తెలిపారు. పదేపదే ప్రయత్నించినప్పటికీ సీతాపుర కేంద్రంలోని అంతర్గత విద్యుత్ సరఫరా సమస్య పరిష్కారం కాకపోవడంతో, అధికారులు అక్కడ పరీక్షను వాయిదా వేయాల్సి వచ్చిందని షెత్ చెప్పారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులకు పునఃపరీక్ష అదే పద్ధతిలో నిర్వహిస్తామని, వారి స్కోర్లు, పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం, పరీక్ష‍కు అంతరాయం కలగడంతో నీట్-పిజి అభ్యర్థులు సీతాపుర కేంద్రం వద్ద నిరసన తెలిపి, దేశవ్యాప్తంగా పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అసలు కారణాలేంటి?

ఎంతో శ్రమపడి, లక్షల రూపాయలు కోచింగ్‌లకు ఖర్చు చేసి మెడికల్ పిజి పరీక్షల కోసం సిద్ధమైన అభ్యర్థుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అకస్మాత్తుగా జరిగిందా? దీని వెనుక వేరే కారణాలు వున్నాయా ? అనేది కొద్దిరోజుల్లో వెలుగులోకి రావచ్చు. నీట్ యుజి, పిజి పరీక్షల కోచింగ్ సెంటర్స్ అత్యధికం రాజస్థాన్‌ రాష్ట్రంలో ఉన్నాయి. కోటా, జైపూర్, సికార్, జోధవపూర్, ఉదయ్‌పూర్, ఆజ్మీర్, అల్వార్ ప్రాంతాల్లో ఈ కోచింగ్ సెంటర్స్ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అలాంటి చోట ఈ ఘటన జరగడం అనేక సందేహాలను కలిగిస్తుంది. నీట్ పరీక్షలను ప్రధాని కార్యాలయమే నేరుగా పర్యవేక్షిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

రాష్ట్రంలో పిజి నీట్‌‌కు 97.40 శాతం హాజరు

దేశవ్యాప్తంగా 2,73,096 మంది అభ్యర్థులు ఆదివారం నీట్‌- పిజి 2026 పరీక్ష రాసారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో 77 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 19,266 మంది అభ్యర్థులకు గానూ 18,765 (97.40 శాతం) మంది హాజరయ్యారు. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నుంచి నోడల్‌ అధికారులుగా ఎన్‌‌టిఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సాయి సుధీర్, పోలీస్‌శాఖ నుంచి డిఐజి ఫక్కీరప్ప పరీక్షా నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్