శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తెనుగుపూడి గురుకులంలో మలేరియా కలకలం

2 గంటల క్రితం

school
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 09:22 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 20 రోజుల్లో 22 మంది విద్యార్థులకు పాజిటివ్

  • మూడు రోజుల్లోనే 13 కొత్త కేసులు నమోదు

  • కనీస వసతులు, పోషకాహారం కరువై నేలపైనే బాధితుల అవస్థలు

  • పరిశుభ్రత లోపించిన హాస్టల్.. భయాందోళనలో 400 మంది విద్యార్థులు

ప్రజాశక్తి-దేవరాపల్లి(అనకాపల్లి) : చదువుపై దృష్టి పెట్టాల్సిన విద్యార్థులు ఇప్పుడు జ్వరాలతో పోరాడుతున్నారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడిలోని ‘డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలుర గురుకుల విద్యాలయం’లో మలేరియా విజృంభిస్తోంది. పాఠశాల ప్రారంభమైన కేవలం 20 రోజుల వ్యవధిలోనే 22 మంది విద్యార్థులకు మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ గత మూడు రోజుల్లోనే ఏకంగా 13 మంది విద్యార్థులు జ్వరాల బారిన పడటంతో గురుకులంలో భయాందోళనలు నెలకొన్నాయి.

ఐసోలేషన్‌లో 13 మంది విద్యార్థులు

జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వైద్య సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించగా మలేరియాగా తేలింది. బాధితుల్లో పి. ప్రశాంత్‌కుమార్, కె. చండిరావు, జె. మహేష్, సీహెచ్. అశోక్, పి. హర్షవర్ధన్, పి. చిన్నారావు, వి. అఖిల్, ఎం. సాత్విక్, ఎస్. జోసెఫ్, ఎం. శశిధర్‌రెడ్డి, బి. కిరణ్‌పాల్, జె. అనంత్, ఎస్. వరుణ్‌తేజ ఉన్నారు. ప్రస్తుతం వీరంతా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక గదిలో చికిత్స పొందుతున్నారు.

కరవైన కనీస వసతులు.. నేలపైనే పడకలు

మలేరియా బారిన పడి నీరసించిన విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో పాఠశాల సిబ్బంది ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక గదిలో మంచాలు లేదా బెడ్స్ లేకపోవడంతో జ్వరంతో ఉన్న విద్యార్థులు నేలపైనే పడుకుని విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. జ్వర పీడితులకు ప్రత్యేకంగా కాచి చల్లార్చిన తాగునీరు, పాలు, గుడ్లు, పండ్లు, బ్రెడ్ వంటి పోషకాహారం అందించాల్సి ఉండగా.. దానికి భిన్నంగా సాధారణ భోజనమే పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌లో హెల్త్ సూపర్‌వైజర్ ఉన్నప్పటికీ, అత్యవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం గమనార్హం.

150 బాత్రూమ్‌లకు.. ఒక్కరే సిబ్బంది!

ప్రస్తుతం 400 మందికిపైగా విద్యార్థులు చదువుతున్న ఈ గురుకులంలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా పడకేసింది. సుమారు 150 బాత్రూమ్‌ల శుభ్రతను పర్యవేక్షించడానికి కేవలం ఒక్కరే పారిశుద్ధ్య కార్మికుడు ఉండటంతో హాస్టల్ ప్రాంగణమంతా అపరిశుభ్రంగా మారింది. గత విద్యా సంవత్సరంలోనూ ఇదే పాఠశాలలో విద్యార్థులు వరుసగా అనారోగ్య సమస్యల బారిన పడ్డారని స్థానికులు గుర్తు చేస్తున్నారు.

అధికారులు స్పందించాలి

ఒకే గురుకులంలో స్వల్ప వ్యవధిలో 22 మందికి మలేరియా సోకడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వ్యాధి మరింత వ్యాపించకుండా ఆరోగ్యశాఖ, గురుకుల విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించాలని కోరుతున్నారు. దోమల నివారణ చర్యలు చేపట్టడంతో పాటు, బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం, పోషకాహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్