రైతు సంఘం జెండాను ఆవిష్కరించిన సీనియర్ నాయకుడు కేశవరావు
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్/సిటీ: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల రెండో రోజు కార్యక్రమాలు శనివారం ఏలూరులోని డీసీఎంఎస్ హాలులో ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన రైతు పతాక గీతంతో సభా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా రైతు సంఘం సీనియర్ నాయకుడు కేశవరావు రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం అఖిల భారత రైతు సంఘం సెక్రటరీ వీజు కృష్ణ.. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే, రైతాంగ ఉద్యమాల కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ, అక్కడి అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తదనంతరం మహాసభలకు హాజరైన రైతు సంఘం నాయకులు, ప్రతినిధులు కూడా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకుడు మంతెన సీతారాం, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏలూరు జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి. రమాదేవిలతో పాటు రైతు సంఘం నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)