విదేశీ పెత్తనాన్ని, కార్పొరేట్ దోపిడీని ఎదిరించినప్పుడే అల్లూరికి నిజమైన నివాళి
అల్లూరి త్యాగాలకు విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన
సిపిఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి గోపాలన్
ప్రజాశక్తి -భీమవరం : మన్యం వీరుడు స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలకు పాలకులు తూట్లు పొడుస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి జె ఎన్ వి గోపాలన్ విమర్శించారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో అల్లూరి సీతారామరాజు 129 వ జయంతి వేడుకలు సిపిఎం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ, బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, గిరిజనుల కోసం, దేశ స్వాతంత్య్రం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. 1897లో జన్మించిన అల్లూరి, 1924లో తన 27వ ఏటనే దేశం కోసం అమరుడయ్యారని గుర్తుచేశారు. నాడు బ్రిటీష్ ప్రభుత్వం మన దేశాన్ని దోచుకుంటూ, ప్రజలను, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులను హింసిస్తూ అటవీ సంపదను కొల్లగొడుతుంటే.. విద్యావంతుడైన అల్లూరి సీతారామరాజు ఆ దోపిడీని సహించక ప్రజలందరినీ ఏకం చేసి వీరోచితంగా పోరాడారన్నారు. అల్లూరి పోరాటం అంటేనే దోపిడీకి, విదేశీ పెత్తనానికి వ్యతిరేక పోరాటమని స్పష్టం చేశారు.ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర పాలకులు ఒకవైపు అల్లూరి విగ్రహాలకు దండలు వేస్తూనే, మరోవైపు ఆయన ఆశయాలకు తీవ్రంగా తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. నేడు అమెరికా వంటి విదేశీ శక్తులు మన దేశంపై అనేక రూపాల్లో పెత్తనం చెలాయిస్తున్నాయని, రష్యా, ఇరాన్ దేశాల నుండి ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేయవద్దని ఆంక్షలు విధిస్తుంటే మన పాలకులు లొంగిపోతున్నారని ఆక్షేపించారు. మన కళ్ల ముందే కేజీ బేసిన్ లో అపారమైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నప్పటికీ, ఇక్కడి ప్రజలు రుయ్. వెయ్యి ర పెట్టి సిలిండర్ కొనుక్కోవాల్సి వస్తోందన్నారు.. మన గ్యాస్‌ను గుజరాత్‌కు చెందిన అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు తరలించి వారిని కోటీశ్వరులను చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఉన్న భూములు, నీళ్లు, విద్యుత్, గ్యాస్ వంటి ప్రజా సంపదను, సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ ప్రజలపై భారాలు మోపడం అల్లూరి త్యాగాలకు పూర్తిగా విరుద్ధమన్నారు. విదేశీ పెత్తనాన్ని, కార్పొరేట్ దోపిడీని ఎదిరించడమే అల్లూరికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని.. ప్రజల సంపదను కాపాడుకునేందుకు, అల్లూరి ఆశయాల సాధన కోసం సిపిఎం నిరంతరం పోరాడుతుందని, ప్రజలందరూ ఈ పోరాటాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.వాసుదేవరావు,జిల్లా కమిటీ సభ్యులు ఎ.రవి, డి.కళ్యాణి భీమవరం పట్టణ నాయకులు, ఎం.వైకుంఠరావు,మల్లిపూడి ఆంజనేయులు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, బొక్కా సత్యనారాయణ, త్రిమూర్తులు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)