మంత్రి లోకేష్‌తో విద్యాశాఖ అధికారులు
ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణపై అధ్యయనం
అధికారులకు మంత్రి ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాల్లోకి ఈ ఏడాది 1.06లక్షల మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశాలు పొందారని విద్య, ఐటి, ఎలక్ర్టానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌కు విద్యాశాఖ అధికారులు వివరించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్యపై అధికారులతో మంత్రి లోకేష్ గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రాథమికోన్నత పాఠశాలలు 7,620 ఉండగా 3,515(46.13శాతం) పాఠశాలల్లో గరిష్ట సామర్థ్యం మేర విద్యార్థుల ప్రవేశాలు పొందారని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టిసారించాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణపై ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. అమరావతిలో రాష్ట్రస్థాయి కేంద్రీయ గ్రంథాలయంతో పాటు విశాఖలో జిల్లా కేంద్రీయ గ్రంథాలయం, మంగళగిరిలో స్కిల్ ఎక్స్ లెన్స్ సెంటర్ భవన నమూనాలను మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. వచ్చే నెలలో రాష్ట్రస్థాయి గ్రంథాలయం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి (ఇన్ ఛార్జి) శ్యామ లరావు, పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా, విద్యా మౌలిక సదుపా యాల సంస్థ ఎండి దీవెన్ రెడ్డి పాల్గొన్నారు.
పారదర్శకంగా ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసెర్ల నియామకాన్ని మరింత పారదర్శకత, నాణ్యత, స్థిరత్వంతో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. వివిధ యూనివర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టులకు ఇప్పటివరకు 1,89,316 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ప్రతి దరఖాస్తును డేటా డ్రివెన్ క్రాస్ వెరిఫికేషన్ చేయాలని మంత్రి సూచించారు. నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా తయారుచేసిన నైపుణ్యం పోర్టల్‌ను జులైలో ఆవిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జపాన్ లో హెల్త్ కేర్ వర్కర్లకు డిమాండ్ ఉన్నందున ఆ కోర్సులు చేసిన అభ్యర్థులకు అవకాశాలు కల్పించడంపై దృష్టిసారించాలని మంత్రి సూచించారు. జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 1,30,422 మందికి ఉద్యోగాలు కల్పించామని అధికారులు చెప్పగా ప్రతి క్వార్టర్ కు ఒకసారి నియోజకవర్గ కేంద్రాల్లో జాబ్ మేళాలు నిర్వహించాలని సూచించారు. స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ద్వారా రాష్ట్రస్థాయిలో స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటుచేసి సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఎండీ గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)