ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కొనసాగుతున్న వివక్ష

1 గంట క్రితం

jvv
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 12:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ‘శంఖారావం’లో దళితుల ఆవేదన

- స్మశాన, డ్రెయినేజీ, తాగునీరు, పాఠశాలలు, తదితర సమస్యల వెల్లువ

ప్రజాశక్తి - యంత్రాంగం : కుల వివక్ష లేని సమాజం కోసం, దళితవాడలలోని మౌలిక వసతుల కల్పనకు, సమస్యల పరిష్కారానికి కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం అధ్యయన యాత్ర ఆదివారం పలు జిల్లాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా దళితులు తమ సమస్యలను యాత్ర బృందాల దృష్టికి తీసుకొచ్చారు.

అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి గ్రామ దళితవాడలో కెవిపిఎస్‌ ‌సామాజిక శంఖారావం అధ్యయన బృందం ఆదివారం పర్యటించింది. దళిత శోషణ్‌ ‌ముక్తి మంచ్‌ వి.శ్రీనివాసరావు స్థానిక నాయకులతో కలిసి దళితవాడలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న స్కూలు పునర్ నిర్మిస్తామని 12 సంవత్సరాల క్రితం కూల్చివేసి, ఇప్పటికీ నిర్మించలేదని దళితులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పామిడికి వెళ్లలేక కొందరు మధ్యలోనే చదువు మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌‌వాడీ కేంద్రం కూడా లేదన్నారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ దళితవాడల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. పామిడి మండలం గజరాంపల్లి గ్రామంలో పాఠశాల, అంగన్‌‌వాడీ కేంద్రం లేదంటే పాలకుల చిత్తశుద్ధి ఎలా ఉందో వీటిని బట్టి అర్థమవుతోందన్నారు. వెంటనే పాఠశాల, అంగన్‌‌వాడీ కేంద్రం నిర్మించాలని డిమాండ్‌ ‌చేశారు.

అనంతపురం రూరల్‌ పరిధిలోని ఎ.నారాయణపురం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి లోకనాథం స్థానిక నాయకులతో కలిసి కాలనీలో పర్యటించారు. లోకనాథం మాట్లాడుతూ ప్రతి దళితవాడకూ రెండు ఎకరాల స్మశాన స్థలాన్ని కేటాయించి, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ​బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామంలో కెవిపిఎస్‌ ‌రాష్ర్ట అధ్యక్ష, కార్యదర్శులు ఓ.నల్లప్ప, అండ్ర మాల్యాద్రి పర్యటించారు. ఇళ్ల పట్టాల సమస్యను బృందం సభ్యులకు దళితులు తెలిపారు. మాల్యాద్రి మాట్లాడుతూ జంతులూరులో ఇళ్ల పట్టాలకు కేటాయించిన సర్వేనెంబర్ 276లో దళితులకు ఇళ్లపట్టాలు ఇవ్వకుంటే కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్, మండల పరిధిలోని రంగేపల్లి, మాగే చెరువు గ్రామాల్లో అండ్ర మాల్యాద్రి జిల్లా నాయకులు ఎంవి.రమణ, కె.హనుమయ్యతో కలిసి పర్యటించారు. మరుగుదొడ్లు, స్మశానవాటికలు, మంచినీరు, సిసి రోడ్లు సమస్యలను స్థానికులు బృందం సభ్యులకు తెలిపారు. మాగేచెరువు గ్రామంలో ఉపాధి బిల్లులు అందడం లేదని, ఆలయాల్లోకి రానివ్వడం లేదని, బిందెడు మంచినీళ్లు కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. మాల్యాద్రి మాట్లాడుతూ దళిత కాలనీల్లో ఈ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

​నెల్లూరు రూరల్ ఆమంచర్ల గ్రామం దళితవాడలో 11వ రోజు శంఖారావంలో భాగంగా బృందానికి గ్రామస్తులు తమ సమస్యలకు తెలిపారు. దళితవాడలో నివసిస్తున్న 20 కుటుంబాలకు గానూ పది కుటుంబాల వారికి సొంత భూమి లేదని, 20 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేవని, పది మందికి పింఛన్లు రావడం లేదని, మంచినీటి సమస్య, డ్రెయినేజీ పూడికలు తీయడం లేదని తెలిపారు. ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు జాబు కార్డులు లేవని, స్మశానానికి ప్రహరీ నిర్మించి షెల్టర్ ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నారు. సామాజిక భవనంలో అంగన్‌వాడీ సెంటర్ నడుపుతున్నారన్నారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు, వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు రూరల్ మండల కార్యదర్శి పాదర్తి మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని పారసాంబ, మండలంలోని పెదంచల, గంగువాడల్లో మున్సిపాలిటీలో పారసాంబ గ్రామం ఉన్నా వీధుల్లో మౌలిక వసతులు కల్పించడం లేదని గ్రామస్తులు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాన రహదారి పాడైపోయి కొన్నేళ్లయినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. డ్రెయినేజీ రెండు నెలలకోసారి కూడా శుభ్రం చేయడం లేదని, వీధి లైట్లు కూడా రెండు నెలలుగా వెలగడం లేదని చెప్పారు. ఈ సందర్భంగా సబ్‌ప్లాన్ నిధులు దళితవాడల్లోనే ఖర్చు చేయాలని కెవిపిఎస్ నాయకులు కె.మోహనరావు డిమాండ్‌ ‌చేశారు. సిఐటియు నాయకులు పాల్గొన్నారు.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలోని దళితుల స్మశాన వాటిక సమస్య పరిష్కరించాలని కోరుతూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్మశాన వాటికలో వసతులు కల్పించాలని, ఆక్రమణలు తొలగించాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో కొండ చుట్టూ ఉన్న ఎస్‌‌సి, ఎస్‌‌టి, బిసి వర్గాల ప్రజలకు ప్రస్తుతం ఉన్న స్మశాన వాటిక నిండిపోయి, ప్రస్తుతం మనిషి చనిపోతే పూడ్చటానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వెలిబుచ్చారు. మంగళగిరి మండలం కాజ, నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో, తాడేపల్లిలోని కొలనుకొండలో ఎస్‌‌సి, ఎస్‌‌టి కాలనీలో స్మశాన స్థలం ఆక్రమణలకు గురవుతున్నట్లు స్థానికులు చెప్పారు. స్మశానంలో బోరు లేక అంత్యక్రియల సమయంలో వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు తెప్పించుకోవాల్సి వస్తోందని వాపోయారు. తాగునీరు, డ్రెయినేజీ, దోమల సమస్యలతో పాటు ఇళ్ల స్థలాల సమస్యలను బృందం దృష్టికి తెచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్