- స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఆవేదన
ప్రజాశక్తి - పార్వతీపురం: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ టీచర్లు, అధ్యాపకులు శుక్రవారం సాలూరులో గల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ‘ప్రాణాలైనా ఇస్తాం, ఉద్యోగాలు సాధిస్తాం’ అన్న నినాదాలతో సుమారు మూడున్నర గంటల పాటు బైఠాయించారు. మంత్రి సంధ్యారాణిని కలిసి సమస్యలు వివరించడానికి గత కొద్దిరోజులుగా గిరిజన సంక్షేమ గురుకుల టీచర్లు, అధ్యాపకుల సంఘం నాయకులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె అందుబాటులో లేకపోవడంతో వారు కొద్ది రోజుల క్రితం అమరావతిలో గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అక్కడ కూడా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. దీంతో, అవుట్ సోర్సింగ్ టీచర్లు, అధ్యాపకులు మంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించారు. సంఘం నాయకులను కొంతమందిని లోపలికి పిలిచి మంత్రి మాట్లాడారు. 980 మంది అవుట్ సోర్సింగ్ టీచర్లు, అధ్యాపకులకు రెన్యువల్ చేశామని, మిగిలిన 450 మందికి కూడా రెన్యువల్ చేయడానికి ఫైల్ సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. కొద్దిరోజుల్లో అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. చర్చలు జరిపిన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున నాయక్ మాట్లాడుతూ మంత్రి సంధ్యారాణి స్పష్టమైన హామీ ఇవ్వలేదని చెప్పారు. దీంతో, తమ నిరసనను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఆకలితో క్యాంపు కార్యాలయం ఎదుట అవుట్ సోర్సింగ్ టీచర్లు, అధ్యాపకులు కొనసాగించారు. మధ్యాహ్నం మంత్రి నివాసానికి చేరుకుంటున్న ఉపాధ్యాయులను సిఐ అప్పలనాయుడు ఆధ్వర్యాన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉపాధ్యాయులు గట్టిగా ప్రతిఘటించడంతో పోలీసులు వెనకడుగు వేశారు.









కామెంట్‌లు (0)