1/70 చట్టాన్ని కాపాడాలి.. జి.ఓ.3కు ప్రత్యామ్నాయ చట్టం తీసుకురావాలి
ప్రజాశక్తి - కురుపాం: గిరిజనుల హక్కులు, చట్టాల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మన్యం బంద్‌లో భాగంగా శనివారం కురుపాంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల నుంచి ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణకు నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీలో తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు. అనంతరం కురుపాం బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ 1/70 చట్ట పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. జి.ఓ.3కు ప్రత్యామ్నాయ చట్టం తీసుకురావడంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాన్-షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరారు. జి.ఓ.3కి ప్రత్యామ్నాయ చట్ట సాధన కమిటీ, 1/70 చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గిరిజన హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కూరంగి సీతారాం, పువ్వుల తిరుపతిరావు, బిడ్డిక అనిల్‌తో పాటు పలువురు ఆదివాసీ నాయకులు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)