- సామాజిక సమస్యలపై దశలవారీ పోరాటాలు
- సామాజిక శంఖారావం వర్క్ షాప్ లో వక్తలు
ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : దళితుల మౌలిక సదుపాయాలకు వినియోగించాల్సిన ఎస్‌సి సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వాలు ఇతర అవసరాలకు కేటాయించి వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ చట్టం తీసుకొస్తామని ఇచ్చిన హామీ అమలులో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉపాధి హామీ చట్టం నిర్వీర్యంతో దళితులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని వివరించారు. సామాజిక సమస్యలపై దశలవారీ పోరాటాలు నిర్వహిస్తామన్నారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సోమవారం కెవిపిఎస్, సిఐటియు ఆధ్వర్యాన సామాజిక శంఖారావం విశాఖ జిల్లా వర్క్ షాప్ నకు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం హాజరయ్యారు. మాల్యాద్రి మాట్లాడుతూ జస్టిస్ పున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, దళితుల స్మశానాలకు జిఒ 1, 2, 3, 5 ప్రకారం భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు. దళితుల జనాభా ఆధారంగా నిధులు కేటాయించి ఖర్చు చేయాల్చి ఉండగా, దీనిని రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం అమలు చేయడంలేదని తెలిపారు. రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రిస్టియన్లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కె.లోకనాథం మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక దళిత, గిరిజనులపై దాడులు పెరిగాయన్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ సేకరణలో దళితులు, గిరిజనులు భూములు కోల్పోతున్నారని తెలిపారు. సమావేశంలో కెవిపిఎస్ విశాఖ జిల్లా కార్యదర్శి చిరంజీవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్, సిఐటియు నాయకులు ఎం.జగ్గునాయుడు, ఎం.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)