అలరించిన ‘వండర్ మ్యాజిక్ షో’
ప్రజాశక్తి వి కోట : విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకొని ముందుకెళ్లాలని జన విజ్ఞాన వేదిక చిత్తూరు జిల్లా జనరల్ సెక్రెటరీ యుగంధర్ బాబు పిలుపునిచ్చారు. జాతీయ శాస్త్రీయ దృక్పథ దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని పాముగానిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యంలో ‘వండర్ మ్యాజిక్ షో’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేవీవీ చిత్తూరు జిల్లా జనరల్ సెక్రెటరీ యుగంధర్ బాబు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో పేరుకుపోయిన పలు మూఢనమ్మకాల వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలను, సైన్స్ సూత్రాలను ఉపయోగించి కొందరు చేసే మోసాలను ప్రత్యక్ష ప్రయోగాల ద్వారా విద్యార్థులకు ప్రదర్శించి చూపించారు. విద్యార్థులు మూఢనమ్మకాలను నమ్మకుండా ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్, జేవీవీ మండల కో-ఆర్డినేటర్ సి.ఎ. మోహన్ రామ్, యుటిఎఫ్ మండల అధ్యక్షులు ఎన్.ఎస్.చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయబృందం, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)