గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం

1 గంట క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 01:23 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సీఐటీయు

ప్రజాశక్తి-మంగళగిరి రూరల్: రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం చినకాకాని నేతన్న సర్కిల్ వద్ద రిలే నిరహార దీక్షలను ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. వీఆర్ఏలకు నెలకు రూ.15 వేల జీతం పెంచుతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చినా అది అమలు కాలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు తదితర హామీలను నెరవేర్చలేదని తెలిపారు. ముఖ్యమంత్రిని రెండుసార్లు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను పలుమార్లు కలిసి సమస్యలను వివరించినప్పటికీ పరిష్కారం లభించలేదన్నారు. ప్రస్తుతం వీఆర్ఏలకు అందుతున్న రూ.11 వేల నుంచి రూ.11,500 వేతనంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. తెలంగాణలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేసి నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి రూ.33 వేల నుంచి రూ.36 వేల వరకు వేతనాలు అందిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తక్కువ వేతనాలతో పనిచేయాల్సి వస్తోందని అన్నారు.

గత కొన్నేళ్లుగా వీఆర్ఏల వేతనాలు పెరగకపోగా విద్యుత్ ఛార్జీలు, కూరగాయలు, పెట్రోల్, డీజిల్ తదితర నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే వీఆర్ఏలకు ప్రమోషన్లు అమలు చేయడం లేదని, ఖాళీగా ఉన్న అటెండర్, వాచ్‌మెన్ తదితర పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీసీఎల్ఏ స్థాయిలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సూచించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వీఆర్ఏలపై అదనపు పనిభారం మోపేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో బాక్సులు, ఎన్నికల సామగ్రి తరలించడం, అధికారులకు టీ, టిఫిన్, భోజన ఏర్పాట్లు చేయడం వంటి అదనపు పనులను చేయబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే వీఆర్ఏ సంఘాలతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ దీక్షలకు సీఐటీయు మంగళగిరి కార్యదర్శి బాలాజీ, వి ఆర్ ఎ ల సంఘం నాయకులు రాష్ట్ర అధ్యక్షులు బన్నంగి సాహెబ్, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్