డిసెంబరు 1, 2 తేదీల్లో సిఐటియు పార్లమెంట్ మార్చ్
అడ్డుకుంటే బైఠాయింపు : ఎలమరం కరీం
దేశవ్యాప్తంగా వేలాది మంది కార్మికులతో మార్చ్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కార్మికుల హక్కులను హరిస్తూ, యాజమాన్యాలకు అనుకూలంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబరు 1, 2 తేదీల్లో పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నట్లు సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్మికులు ఈ మార్చ్‌లో పాల్గొంటారని చెప్పారు. బుధవారం నాడిక్కడ సిఐటియు కేంద్ర కార్యాలయం (బిటిఆర్ భవన్)లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిఐటియు అధ్యక్షులు సుదీప్ దత్త, ఉపాధ్యక్షులు తపన్ సేన్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
డిసెంబరు ఒకటిన కార్మికులు పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహించనున్నారని, పోలీసులు అడ్డుకుంటే అక్కడే బైఠాయించి నిరసన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చట్టసభల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ప్రజలకు వివరించడమే మార్చ్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు దేశవ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
పట్టించుకోని కేంద్రం
లేబర్ కోడ్‌ల రద్దు సహా పలు డిమాండ్లతో ఫిబ్రవరి 12న నిర్వహించిన సమ్మెలో సుమారు 40 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారని ఎలమరం కరీం తెలిపారు. ఆగస్టు 10న సంయుక్త కిసాన్ మోర్చా, సిఐటియు సహా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో ఆందోళన నిర్వహించామని గుర్తుచేశారు. అయినా కార్మికుల భారీ ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా లేబర్ కోడ్‌ల అమలుకు సంబంధించిన నిబంధనలను విడుదల చేసిందని విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లేబర్ కోడ్‌లను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. కార్మికుల భద్రత, సంఘటితమయ్యే హక్కు, కనీస వేతనాలు, సామాజిక భద్రతకు విఘాతం కలిగించే విధానాలను తిప్పికొట్టేందుకు మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబరు ఒకటిన ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లు
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి.
స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం, ఇపిఎఫ్, ఇఎస్ఐ, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కల్పించాలి.
కార్మికులు, స్వయం ఉపాధి పొందుతున్న వారందరికీ నెలకు రూ.42 వేల కనీస వేతనం, రూ.21 వేల కనీస పెన్షన్ ఇవ్వాలి.
ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలి. శాశ్వత స్వభావం కలిగిన పనులు చేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలి. అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
కార్మికుల ప్రాణాలకు ముప్పు కలిగించే భద్రతా నిబంధనల ఉల్లంఘనలను అరికట్టాలి. భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు, నిరసనలను నేరాలుగా మార్చే ప్రయత్నాలను విరమించాలి.
నీరు, అడవులు, భూమిపై ప్రజల హక్కులను కాపాడాలి. ప్రకృతి, సహజ వనరులను రక్షించాలి. అక్రమ భూసేకరణను అడ్డుకోవాలి. నిర్వాసితులకు తగిన పరిహారం, ఉపాధి కల్పించాలి.







కామెంట్‌లు (0)