టిటిడి సరికొత్త నిర్ణయం
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సేవలకు అవసరమయ్యే అటవీ ఉత్పత్తులను గిరిజన సహకార సంస్థ (జిసిసి) నుంచి కొనుగోలు చేయాలని ఈ నెల 15న జరిగిన పాలకమండలిలో నిర్ణయించింది. దాదాపు రూ.12.97 కోట్లతో సరకులు తీసుకునేందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. శ్రీవారి యాత్రికులకు గిరిజన ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని సంకల్పించింది. ఇందుకోసం తిరుమలలో గిరిజన సహకార సంస్థ వారి సౌజన్యంతో రిటైల్ అవుట్ లెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఏడాది పాటు నామినేషన్ పద్ధతిలో జిసిసి నుంచి సరుకులు కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం రెండో కొత్త సత్రం దగ్గర (గతంలో దొడ్ల డెయిరీ ఉన్న స్థలంలో) 144 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐరన్ షీట్ రూఫింగ్‌తో ఈ ప్రత్యేక దుకాణం అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే, ఈ కేటాయింపు విషయంలో టిటిడి కొన్ని కఠిన నిబంధనలు విధించింది. ఈ దుకాణాన్ని ఎవరికీ సబ్‌లీజుకు ఇవ్వకూడదని, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నడపకూడదని, స్వచ్ఛమైన తేనె, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులను విక్రయించాలని నిర్ణయించింది. తేనె, కుంకుడు కాయల పొడి, ఎండుమిర్చి తదితర వస్తువులను నామినేషన్ పద్ధతిలో తీసుకోవాలని కమిటీ సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తిరుమలలో గిరిజన ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి.







కామెంట్‌లు (0)