మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాష్ట్రంలో యుఎఇ ఫుడ్ క్లస్టర్

1 గంట క్రితం

రాష్ట్రంలో యుఎఇ ఫుడ్ క్లస్టర్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 12:19 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అవగాహనా ఒప్పందంపై సంతకాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : యుఎఇ ఫుడ్ క్లస్టర్ ద్వారా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను పెట్టేలా అవగాహనా ఒప్పందం కుదిరింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యుఎఇ ఆర్ధిక, పర్యాటక విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో ఎంఓయూను మంగళవారం కుదుర్చుకున్నారు. అంతకుముందు ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై సచివాల యంలో సిఎం చంద్రబాబుతో యుఎఇ ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. మామిడి, అరటి, కోకో లాంటి వివిధ ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, విలువ జోడించిన ఉత్పత్తుల ఎగుమతులు, వాణిజ్యం లాంటి అంశాల్లో ఒప్పందం కుదుర్చుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఒప్పందంలో తొలి అడుగుగా యుఎఇకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఏపీలోని చిత్తూరులో రూ.100 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు అంగీకరించింది. చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను తయారు చేయనుంది.

ఉద్యాన రంగంలో దేశంలోనే అగ్రస్థానం

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరిచిన యుఎఇ ఆరు నెలల్లోగా వాటిని సాకారం చేసే దిశగా ముందుకు వచ్చిందని సిఎం చంద్రబాబు అన్నారు. దీనితో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులకు రాష్ట్రం వేదిక కానుందని వ్యాఖ్యానించారు. ఉద్యాన, ఆక్వా, ఐటీ రంగాల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలోని వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాది పొడవునా వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులు సాగు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర స్థూల ఆదాయంలో 30 శాతం మేర ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వస్తోందని చెప్పారు. రూ. 1 లక్ష కోట్ల ప్రభుత్వం, ప్రైవేటు పెట్టుబడితో రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హబ్‌గా మారుస్తున్నామని తెలిపారు. రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. 200కు పైగా ఉద్యాన క్లస్టర్లతో అక్వా మిర్చి, పామాయిల్, కోకో, కాఫీ తదితర పంటల్లో ఏపీ ఎగుమతులు చేస్తోందని యూఏఈ ప్రతినిధి బృందానికి వివరించారు. కృష్ణా-గోదావరి డెల్టాలో నిరంతర నీటి సరఫరా కారణంగా వ్యవసాయ ఉత్పత్తి సాధించగలుగుతున్నామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్రం ఓ విధానంగా మారిందని తెలిపారు.

అవకాశాలు అందిపుచ్చుకుంటాం

కృష్ణా - గోదావరి లాంటి నదులున్న రాష్ట్రంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని యుఎఇ ఎకానమీ, టూరిజం విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ వ్యాఖ్యానించారు. భారత్- యుఎఇ వాణిజ్య బంధంలో భాగంగా రాష్ట్రంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా పని చేస్తున్నట్లు చెప్పారు. రొయ్యలు, ఉద్యాన ఉత్పత్తులు వాణిజ్యంలో కీలకంగా ఉన్నాయని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ సహా వివిధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. అమరావతి నుంచి న్యూయార్క్ మార్కెట్ వరకూ డెయిరీ, పౌల్ట్రీ, సీఫుడ్ , పప్పు దినుసులు తదితర రంగాల్లో ఎగుమతులపై దృష్టి పెడతామని అన్నారు. కృష్ణపట్నం, కాకినాడ నుంచి యుఎఇకి షిప్పింగ్ రూట్లోనూ వాణిజ్యం మరింత పెరిగేందుకు సహకరిస్తామని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్