మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజంతర్‌‌మంతర్‌‌కు పోటెత్తిన యువతరం

1 గంట క్రితం

delhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 12:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

​• ఉద్యమ శిబిరం పునరుద్ధరణ ​

• సిజెపి పోరుకు పెరుగుతున్న మద్దతు

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ విద్యారంగంలోని అక్రమాలను ప్రశ్నిస్తూ పోరుబాట సాగిస్తున్న యువతకు మద్దతు మరింతగా పెరుగుతోంది. చలో పార్లమెంటు మార్చ్‌ ‌సందర్భంగా ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు యువతపై సాగించిన అమానవీయ దాడుల నేపథ్యంలో మంగళవారం నాడు జంతర్‌‌మంతర్‌ ‌వద్దకు పెద్ద సంఖ్యలో యువత పోటెత్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా నిర్దేశంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు సోమవారం నాడు భీతావహ దాడులతో జంతర్‌‌మంతర్‌ వద్ద ధ్వంసం చేసిన పోరాట శిబిరాన్ని యువత పునరుద్ధరించారు. మోడీ ప్రభుత్వ అణచివేత చర్యలను పోరాట స్ఫూర్తితో అధిగమించి ఆ ప్రదేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్ మార్చ్ అనంతరం పోలీసులు, కేంద్ర బలగాలు కూల్చివేసిన ఎస్ఎఫ్ఐ క్రాంతి కార్నర్‌తో సహా నిరసన టెంట్లను మంగళవారం గంటల వ్యవధిలోనే పునరుద్ధరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ జరుగుతున్న ఆందోళ‌న‌ను ఓడించలేర‌నే బలమైన హెచ్చరికను మరింత గట్టిగా వినిపిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళ‌న నుంచి ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయబోమని ప్రకటించారు.

పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్న వేలాది మంది విద్యార్థులను పోలీసులు, కేంద్ర బలగాల దాడిలో గాయపడిన విద్యార్థులకు, యువకులకు ఢిల్లీలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్ఎంఎల్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు, యువ‌త‌ను ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ, ఎంపిలు ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్ ప‌రామ‌ర్శించారు. ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రులు అర‌వింద్ కేజ్రీవాల్‌, అతిషి, ఎంపి సంజ‌య్ సింగ్ త‌దిత‌రులు ప‌రామ‌ర్శించారు. కేంద్ర మంత్రి జెపి న‌డ్డా కూడా ప‌రామ‌ర్శించారు. అయితే పరామర్శించడానికి వెళ్తున్న సిజెపి, విద్యార్థి సంఘ నేత‌ల‌ను పోలీసులు అడ్డుకొని వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. నిర్బంధంలో ఉన్నవారికి న్యాయవాదులను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోతే, ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వెలుపల శాంతియుత ధర్నా చేపడ‌తామ‌ని సిజెపి ప్రతినిధులు అశుతోష్ రాంకా, దీపక్ బలియాన్, సౌరవ్ దాస్ ప్రకటించారు. కొందరు తమ గాయాలను సైతం లెక్కచేయకుండా జంతర్ మంతర్ వద్దే ఉండిపోయారు. జంతర్ మంతర్ వద్ద సిజెపి, విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళ‌న‌ 32 రోజు మంగ‌ళ‌వారం కొన‌సాగింది. కాగా ఢిల్లీ పోలీసులు ఐదు ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేశారు. పోలీసులు, భ‌ద్ర‌తా ద‌ళాల‌పై దాడులు, పోలీసు, ప్ర‌భుత్వ వాహ‌నాల ధ్వంసం, ప్ర‌జా ఆస్తుల ధ్వంసం వంటి నేరాల‌పై ఈ ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న‌ల్లో మొత్తం 118 మంది భ‌ద్ర‌తా సిబ్బంది గాయ‌ప‌డ్డార‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 70 మందికిపైగా ఆందోళ‌న‌కారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధానిలో వివిధ దళాలకు చెందిన 3,000 మందికి పైగా సాయుధ భద్రతా సిబ్బందిని మోహరించారు.

​మేదాంత‌కు వాంగ్‌చుక్‌ త‌ర‌లింపు

పోలీసుల అదుపులో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను 25వ రోజుకు కొనసాగించారు. ఆసుపత్రిలో ఉన్న వాంగ్‌చుక్, తన డిమాండ్లను అంగీకరించే వరకు వెనక్కి తగ్గబోనని ప్రకటించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశం తరువాత ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్‌లోని మేదాంతకు తరలించారు. మంగళవారం సాయంత్రం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, తదుపరి చికిత్స కోసం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించినట్లు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి అధికారులు తెలిపారు. తదుపరి వైద్య సంరక్షణ కోసం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రి వైద్యుల బృందానికి అప్పగించడం జరిగింద‌ని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

mailgoogle

​జంతర్‌‌మంతర్‌కు తరలిన నేతలు

అణచివేత, పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ఒంటరిగా లేరని ప్రకటిస్తూ ప్రతిపక్షాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు జంతర్‌‌మంతర్‌ ‌వద్దకు వచ్చి నిరసనకారులకు తమ మద్దతు తెలియజేశారు. సిపిఎం ఎంపిలు అమ్రారామ్, కె. రాధాకృష్ణన్, జాన్ బ్రిట్టాస్, వి. శివదాసన్, ఎఎ రహీమ్, ఎస్ వెంకటేశన్, ఆర్. సచ్చిదానందం, సిపిఐ ఎంపిలు పి. సంతోష్ కుమార్, పిపి సునీర్, కె సుబ్బరాయన్, కేరళ కాంగ్రెస్ (ఎం) ఎంపి జోస్ కె మణి జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను, గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రులు అరవింద్ కేజ్రీవాల్, అతిషి, ఎన్‌సిపి అధినేత‌ శరద్ పవార్, శివ‌సేన ఎంపిలు సంజ‌య్ రౌత్‌, అర‌వింద్ సావంత్‌ కూడా జంతర్ మంతర్‌కు చేరుకుని సంఘీభావం తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్