మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్ టిసి ఉద్యోగుల ఉద్యమానికి సంఘాల మద్దతు

10 ఆగస్టు, 2026

rtc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 08:59 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి

- 17, 18న 129 డిపోలు, నాలుగు వర్క్‌షాపుల వద్ద సామూహిక నిరాహార దీక్షలు

- 28న జిల్లా కేంద్రాల్లో మహాధర్నాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్ టిసి ఉద్యోగుల న్యాయమైన సమస్యలు, పెండింగ్ బకాయిలు, ఉద్యోగ హక్కుల పరిరక్షణ కోసం ఎపిపిటిడి (ఆర్ టిసి) ఉద్యోగ సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమానికి వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాల మద్దతు లభిస్తోంది. ఉద్యమ కార్యాచరణకు సంఘీభావం కూడగట్టడంలో భాగంగా సోమవారం జెఎసి ప్రతినిధులు పలువురు రాష్ట్రస్థాయి నాయకులను కలిసి వినతిపత్రాలు అందజేసి మద్దతు కోరారు.టిఎన్ టియుసి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సాయిచరణ్, ఐఎన్‌టియుసి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మన్నల రాజశేఖర్, ఆర్ టిసి ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావు, ఆర్ టిసి సూపర్‌వైజర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వర్లులను ఆర్ టిసి జెఎసి నాయకులు కలిసి ఆర్ టిసి ఉద్యోగులు ఎదుర్కోంటున్న సమస్యలను వివరించారు.పెండింగ్‌లో ఉన్న న్యాయమైన బకాయిలు, ఉద్యోగుల హక్కులకు సంబంధించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఆర్ టిసి ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి జెఎసి చేస్తోన్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయా సంఘాల నాయకులు స్పష్టం చేసినట్లు జెఎసి ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. టిఎన్ టియుసి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ ఆర్ టిసి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రవాణాశాఖ మంత్రి, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఆర్ టిసి ఉద్యోగుల హక్కుల సాధన కు చేపడుతోన్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 17, 18 తేదీల్లో రాష్ట్రంలోని 129 డిపోలు, నాలుగు వర్క్‌షాపుల వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు జెఎసి ప్రతినిధులు తెలిపారు. అనంతరం ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లోని(డిపిటిఒ) కార్యాలయాల వద్ద మహాధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎపిపిటిడి(ఆర్ టిసి) ఉద్యోగ సంఘాల జెఎసి కన్వీనర్లు వలిశెట్టి దామోదరరావు, కో-కన్వీనర్లు పివి రమణారెడ్డి,జివి నరసయ్య, ఎస్ వి శేషగిరిరావు, వై శ్రీనివాసరావు,సిహెచ్ సుందరయ్య, ఎస్ కె జిలానీ, జెఎసి నాయకులు శ్రీనివాసరాజు, టివి భవాని, తదితరులు పాల్గొన్నారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్