mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖ ఎయిర్ పోర్టును కొనసాగించాలి

1 గంట క్రితం

billy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 11:53 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎం బైకు ర్యాలీ

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖపట్నం ఎయిర్‌‌ పోర్టును మూసివేయొద్దని, డొమెస్టిక్ ఎయిర్‌ ‌పోర్టుగా కొనసాగించాలని డిమాండ్‌ ‌చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన విశాఖ నగరంలో శనివారం బైకు ర్యాలీ నిర్వహించారు. జోరువానలోనూ ఈ బైకు ర్యాలీ విశాఖ దక్షిణ, ఉత్తర, తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం ఎయిర్ పోర్టును డొమెస్టిక్ ఎయిర్ పోర్టుగా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్‌ ‌చేశారు. లేనిపక్షంలో ఆయన విశాఖ ఎప్పుడు వచ్చినా ప్రజా నిరసన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జులైలో ప్రారంభమైన వెంటనే విశాఖపట్నం ఎయిర్ పోర్టును మూసివేసేందుకు ప్రభుత్వం సిద్ధపడడం అత్యంత ఆందోళనకరమన్నారు. ఈ ఎయిర్ పోర్టు మూతబడితే పర్యాటక, రవాణా, హోటల్, సేవా, వాణిజ్య వ్యాపార రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. వేలాది మంది ఉపాధి కోల్పోతారని తెలిపారు. విశాఖను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామని, ఐటి హబ్‌‌గా మారుస్తామని మోడీ, చంద్రబాబులు ప్రజలకు హామీ ఇచ్చి, ఎయిర్ పోర్టు లేని విశాఖగా తయారు చేయడానికి పూనుకోవడం ప్రజా వంచనేనని విమర్శించారు. విశాఖ ఎంపి శ్రీ భరత్ భోగాపురం ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి ప్రజలకు కష్టాలు ఉండవని చెబుతున్నారని, ఆయన ఎంపి హోదాలో కాకుండా సాధారణ ప్రయాణికునిలా లంకెలపాలెం నుండి తగరపువలస వరకు ప్రైవేట్ ట్యాక్సీలో ప్రయాణం చేసి చూడాలని హితవుపలికారు. భోగాపురం ఎయిర్ పోర్టే విశాఖ ఎయిర్ పోర్టు అని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడ‌డం ప్రజల కష్టాల పట్ల వారి నిర్లక్ష్యానికి అద్దంపడుతోందన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం జిఎంఆర్‌‌కు సేవ చేయడం ఆపి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌‌కెఎస్‌‌వి కుమార్, వి కృష్ణారావు, జిల్లా నాయకులు ఎం సుబ్బారావు, పి పైడిరాజు, యుఎస్ఎన్ రాజు, వి నరేంద్ర కుమార్, ఎం చంటి పాల్గొన్నారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్