రాష్ర్టాలు వేరైనా మనమంతా ఒకటే
ముగ్గురు సిఎంల ఉమ్మడి ప్రకటన
తుంగభద్ర డ్యామ్ నూతన గేట్లు ప్రారంభం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : రైతాంగ ప్రయోజనాలు కాపాడటమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్ ప్రకటించారు. కర్ణాటకలోని విజయనగర జిల్లా హొస్పేట్ లోని తుంగభద్ర డ్యామ్‌కు ఏర్పాటు చేసిన నూతన గేట్ల ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్‌తో కలిసి మూడు రాష్ట్రాల సిఎంలు పాల్గొన్నారు. 17వ గేటును సిఆర్ పాటిల్, 18వ గేటును శివకుమార్,19వ గేటును చంద్రబాబు, 20వ గేటును రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు సిఆర్ పాటిల్ నేతృత్వంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర ప్రాజెక్టు, జలాల వినియోగంపై సమావేశమ య్యారు. మూడు రాష్ట్రాల ప్రయోజనాలపై నలుగురు నేతలు విస్తృతంగా రైతాంగ ప్రయోజనాలే లక్ష్యం చర్చించారు. అనంతరం మునీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బహిరంగ సభలో ముగ్గురు సిఎంలు మాట్లాడుతూ దీనిని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒక్కటేనని, రైతుల సంక్షేమం కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ నదుల అనుసంధానంతో జలాలు సమృద్ధిగా ఉంటాయని అన్నారు. ప్రస్తుత డ్యామ్‌లు ఆధునిక సాంకేతికతతో రూపొందుతున్నాయన్నారు. తుంగభద్ర డ్యామ్ ప్రాజెక్టులో ఒక్క గేటు కొట్టుకుపోవడం వల్ల అన్ని గేట్లూ మార్చాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నర్మద, సరోవర్ జలాల అనుసంధానంతో గుజరాత్‌లో నదీ జలాలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. లక్ష కోట్లతో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో మూడు నదులు అనుసంధానం చేపట్టామన్నారు.
భారత్ అన్‌స్టాపబుల్ :చంద్రబాబు
గంగా - కావేరి అనుసంధానంతో భారత్ అన్ స్టాపబుల్ గా మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. దేశ భవిష్యత్తు కోసం నదుల అనుసంధానం అత్యంత అవసరమన్నారు. కెన్–బేత్వా ప్రాజెక్టు ద్వారా ఉత్తర భారతదేశంలో నదుల అనుసంధానం విజయవంతంగా అమలవుతోందని, అదే తరహాలో గోదావరి–కావేరి అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరతాయన్నారు. ఎల్‌నినో ప్రభావంతో జలాశయాలకు నీటి ప్రవాహాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తుంగభద్ర ప్రాంత రైతుల ప్రయోజనాలపై చర్చించడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. డ్యామ్ మరమ్మతులో భాగంగా రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఎపి, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
జల వివాదాలను పరిష్కరించుకుందాం: రేవంత్ రెడ్డి
తుంగభద్ర నది ఒడ్డున జరిగిన సమావేశం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుందని, మూడు తరాల సమస్యలను 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతోందని చెప్పారు.
బళ్లారి, కర్నూలు, అనంతపురం, పాలమూరు సమస్యలు తీరుస్తుందన్నారు. రాజోలిబండ డైవర్షన్ స్కీములో పాలమూరుకు కేటాయించిన 15 టిఎంసిలలో కేవలం ఐదు టిఎంసిలు మాత్రమే వాడుకోగలుగుతున్నామని, దాదాపు పది టిఎంసిల నీరు తమ వరకూ రావట్లేదని, ఈ సమస్యను సిఆర్ పాటిల్, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
మన నీరు మన హక్కు : డికె శివ కుమార్
మన నీరు మన హక్కు అని, మన నీటి వాటాను కాపాడుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఉద్ఘాటించారు. రైతుల ప్రయోజనాల కోసం మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, అధికారులు కలిసి గంటకు పైగా చర్చలు జరిపామని, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. మూడు రాష్ర్టాల రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు చారిత్రక నిర్ణయం తీసుకున్నామన్నారు. తాము చరిత్ర చదవడానికి రాలేదని, చరిత్ర సృష్టించడానికి వచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తెలంగాణ ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు, సహా మూడు రాష్ట్రాల స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)