మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక ఎన్నికల్లో పారా మిలటరీ దళాల ఏర్పాటుకు నిరాకరణ

12 గంటల క్రితం

lcoal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 07:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – అమరావతి : స్థానిక ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరిగేందుకు పారా మిలటరీ దళాలను ఏర్పాటు చేయాలంటూ వైసిపి దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సబబేనని పేర్కొంటూ జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ ఆలపాటి గిరిధర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. నామినేషన్లు దాఖలు చేయకుండా ప్రతిపక్ష పార్టీల నేతలను అధికార కూటమి అడ్డుకుంటోందని, నామినేషన్‌ కేంద్రాల వద్దకు రానివ్వకుండా దాడులకు పాల్పడుతూ వాహనాలను తగులబెడుతున్నారని వైసిపి తరపున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పారా మిలటరీ దళాలను ఏర్పాటు చేయడం తప్పనిసరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదిస్తూ, రెండు జిల్లాల్లో జరిగిన ఆరేడు చిన్న ఘటనలను పెద్దవిగా చూపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పారా మిలటరీ దళాల ఏర్పాటును కోరుతున్నారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌ పరిస్థితులతో పోలుస్తూ వైసిపి పిటిషన్‌ దాఖలు చేయగా, సింగిల్‌ జడ్జి దానిని తోసిపుచ్చారని తెలిపారు. పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని, పరిస్థితి అదుపులో ఉందని, ఇప్పటికే సున్నిత, అతి సున్నిత ప్రాంతాలను గుర్తించి ఎన్నికల నిర్వహణకు 32.5 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సమర్థిస్తూ వైసిపి అప్పీలును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్