- మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ప్రజాశక్తి-అమనావతి బ్యూరో : రామాయపట్నం పోర్టును పిపిపి విధానంలో అభివృద్ధి చేయడంపై వైపిపి ప్రశ్నించే నైతిక హక్కు లేదని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గత వైసిపి ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు ఇష్టారీతిన అప్పగించిందని విమర్శించారు. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న 10.40 శాతం వాటాను అదానీ సంస్థకు విక్రయించింది ఎవరో జగన్ సమాధానం చెప్పాలని సోమవారం ఒక ప్రకటనలో మంత్రి డిమాండ్ చేశారు. 2023లో ఎలాంటి పారదర్శక టెండర్ విధానం లేకుండా రెండు బెర్తులను జేఎస్‌డబ్ల్యూ సంస్థకు అప్పగించినప్పుడు ప్రజా ప్రయోజనాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
రామాయపట్నం పోర్టు పనులు వైసీపీ హయాంలో 95 శాతం పూర్తయ్యాయన్న ప్రచారం అవాస్తవమని మంత్రి స్పష్టం చేశారు. 2024 జూన్ నాటికి పోర్టు పనులు కేవలం 50 శాతం మాత్రమే పూర్తయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో పనులను 80.50 శాతానికి తీసుకువచ్చామని తెలిపారు. భూసేకరణను గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేయగా, కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. రామాయపట్నం పోర్టు అభివృద్ధికి ప్రభుత్వం రూపొందిస్తున్న పిపిపి విధానంలో రూ.1,500 కోట్ల ముందస్తు ప్రీమియం, రాబడి భాగస్వామ్యం, కనీస హామీ ఆదాయం, కనీసం 12 శాతం నాన్-డైల్యూటబుల్ ఈక్విటీ వంటి నిబంధనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. కాంట్రాక్టర్ వివిధ దశల్లో పెట్టే సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడిలోనూ ప్రభుత్వానికి 12 శాతం ఈక్విటీ వాటా ఉంటుందని పేర్కొన్నారు.
రవాణా వ్యయంపై ప్రత్యేక అధ్యయనం
రాష్ట్రంలో రవాణా వ్యయాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక అధ్యయనం నిర్వహించడానికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తెలిపారు. అధ్యయనాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించినట్లు వెల్లడించారు.
రవాణా వ్యయంపై సమగ్ర అంచనా కోసం నిర్వహించే ఈ అధ్యయనానికి రూ.1.06 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో రవాణా, సరుకు తరలింపు, నిల్వ తదితర అంశాలకు సంబంధించిన వ్యయాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని తెలిపారు.








కామెంట్‌లు (0)