- బ్రాహ్మీ లిపి చెక్కిన ఉంగరం లభ్యం
బ్యాంకాక్: పశ్చిమ థాయ్‌లాండ్‌లోని పెట్చబురి ప్రావిన్స్‌లో నిర్వహించిన పురావస్తు తవ్వకాలలో సుమారు 2,000 ఏళ్ల నాటి రెండు బంగారు ఉంగరాలు వెలుగులోకి వచ్చాయి. డాన్ యాయ్ థాంగ్ ప్రాంతంలో మానవ అస్థిపంజరాలతో పాటు ఈ ఉంగరాలు లభించినట్లు థాయ్‌లాండ్ లలిత కళల శాఖ వెల్లడించింది. వెలికితీసిన ఉంగరాల్లో ఒకదానిపై ప్రాచీన భారతీయ బ్రాహ్మీ లిపిలో "పుసరఖితాస" అనే శాసనం చెక్కబడి ఉందని అధికారులు తెలిపారు. దీనికి "బుద్ధునిచే రక్షించబడినది" అనే అర్థం వస్తుందని పేర్కొన్నారు. మరో ఉంగరం ఎలాంటి నమూనాలు లేని సాధారణ బంగారు ఉంగరంగా గుర్తించారు. ఈ ఉంగరాలు సుమారు 2,500 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి వచ్చిన వ్యాపారులతో సంబంధం కలిగి ఉండవచ్చని పురావస్తు శాఖ అభిప్రాయపడింది. ఈ ఆవిష్కరణ ప్రాచీన కాలంలో భారతదేశం–థాయ్‌లాండ్ మధ్య ఉన్న వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలకు మరో ఆధారంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
రాజధాని బ్యాంకాక్‌కు నైరుతి దిశలో సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాన్ యాయ్ థాంగ్ ప్రాంతం ఈ ఏడాది ప్రారంభంలో స్థానికులు వరి పొలంలో పురాతన కంచు డ్రమ్ శకలాలను గుర్తించిన తర్వాత పురావస్తు శాఖ పర్యవేక్షణలోకి వచ్చింది. అనంతరం చేపట్టిన తవ్వకాలలో ఈ విలువైన అవశేషాలు వెలుగులోకి వచ్చాయి.
పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఎనిమిది మానవ అస్థిపంజరాలు, కంచు, బంగారు ఆభరణాలు, మట్టిపాత్రలు, అలాగే ఉన్నత వర్గాల ఆచారబద్ధమైన ఖననాన్ని సూచించే పలు పురావస్తు వస్తువులను గుర్తించారు. డాన్ యాయ్ థాంగ్ ప్రాంతం సుమారు 1,500 నుంచి 2,500 సంవత్సరాల క్రితం ఇనుపయుగంలో జనావాసంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ తవ్వకాలను మరో నెల రోజుల్లో పూర్తి చేసి, వెలికితీసిన పురావస్తు వస్తువులను ప్రజల సందర్శన కోసం ప్రదర్శించనున్నట్లు థాయ్‌లాండ్ లలిత కళల శాఖ వెల్లడించింది.







కామెంట్‌లు (0)