- రెండేళ్లలో 16 మంది దళితులను చంపేశారు
: బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగ్రహం
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దళితులు కనీసం బతికే స్వేచ్ఛను కూడా కోల్పోయారని, ఒకపక్క ప్రభుత్వం, ఇంకో పక్క పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో 16 మందికిపైగా దళితులను ఈ ప్రభుత్వం పొట్టనపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ తొలి దళిత ఉప ప్రధానిగా, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన బాబూ జగ్జీవన్ రామ్ (బాబూజీ) వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటం వద్ద పార్టీ నాయకులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రిగా 'హరిత విప్లవం' విజయవంతం కావడంలో బాబూజీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. కుల, మత బేధాలు లేని సమసమాజ స్థాపన కోసం ఆయన నిరంతరం కృషి చేశారని, మనుషుల మధ్య గోడలు కూల్చి, మానవత్వాన్ని చాటడమే దేశ ప్రగతికి మూలస్తంభం అని చెప్పారన్నారు.
రాష్ట్రంలో నరమేధం సృష్టిస్తున్నారు
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నరమేధం సృష్టిస్తోందని, అడుగడుగునా చట్టాలు, న్యాయ నిబంధనలను ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కడం, అక్రమ కేసులతో వేధించడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. పాలన చేతకాక దురహంకారంతో కూటమి నాయకులు రెచ్చిపోతున్నారని, ప్రతిఘటించేవారిని చంపడమే ఎజెండా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతి కుమార్, కర్నూలులో పోలీసుల దెబ్బలకు తాళలేక చనిపోయిన మాల గంగమ్మల మరణాలే కూటమి పాలనలో దళితులపై జరుగుతున్న దాష్టీకాలకు నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా పేరుపోగు క్రాంతికుమార్ మరణానికి నివాళులు అర్పిస్తూ కాసేపు పార్టీ నాయకులు మౌనం పాటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని, ఎన్ని కేసులు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా వైఎస్ జగన్ నేతృత్వంలో బాధితుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేశ్, శంకర నారాయణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, పార్టీ అధికార ప్రతినిధి వేల్పుల రవి తదితరులు పాల్గొని ప్రసంగించారు. వీరితోపాటు వివిధ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ వర్ధంతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)