సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలి

2 గంటల క్రితం

aiks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 06:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రామ మందిర దోపిడీ, భూ కుంభకోణంపై నిష్పక్షపాత విచారణ జరపాలి
- అఖిల భారత కిసాన్ సభ డిమాండ్

లక్నో: అయోధ్య రామ మందిరానికి సంబంధించిన దోపిడీ, భూ కుంభకోణం ఆరోపణలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో నిష్పక్షపాత విచారణ జరిపించాలని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) డిమాండ్ చేసింది. లక్నోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎస్ జాతీయ నాయకులు పి. కృష్ణ ప్రసాద్, బాదల్ సరోజ్, ముకుత్ సింగ్ మాట్లాడుతూ, అయోధ్యలో ఆలయ నిర్మాణం, భూసేకరణ ప్రక్రియలో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు. లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ అండతో ఈ వ్యవహారం జరిగిందని వారు మండిపడ్డారు. ఆలయానికి విరాళంగా వచ్చిన బంగారం, వెండి, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులు గల్లంతయ్యాయన్న ఆరోపణలను సమగ్రంగా విచారించాలని వారు కోరారు. మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి తాను విరాళంగా ఇచ్చిన బంగారు పూత పూసిన రామాయణం కనిపించడం లేదని బహిరంగంగా ప్రస్తావించారని పేర్కొన్నారు. దోపిడీదారులకు ప్రభుత్వ రక్షణ లభిస్తోందన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని సమావేశంలో డిమాండ్ చేశారు.

అధికార పార్టీతో సన్నిహిత సంబంధాలున్న కార్పొరేట్లు, ప్రముఖులు వ్యక్తిగత లాభం కోసం అయోధ్యను పద్ధతి ప్రకారం దోచుకుంటున్నారని తెలిపారు. నిమిషాల వ్యవధిలోనే భూమి ధరలు ఆకాశాన్నంటాయి, నకిలీ లావాదేవీలు జరిగాయి. చంపత్ రాయ్, ఇతర మధ్యవర్తులు అసలైన భూ యజమానులకు నామమాత్రపు సొమ్ము చెల్లించి కోట్లాది రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. ఈ భూ మాఫియా వందలాది పురాతన దేవాలయాలను, ప్రభుత్వ భూములను కూడా వదల్లేదని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో కొందరు మధ్యవర్తులు, అధికార పార్టీతో సంబంధాలున్న వ్యక్తుల పాత్రపై దర్యాప్తు జరగాలని వారు డిమాండ్ చేశారు. 2021లో యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన దర్యాప్తు నివేదికను ఇప్పటికీ విడుదల చేయలేదని వారు విమర్శించారు. దర్యాప్తు పేరుతో చిన్నస్థాయి నిందితులపైనే చర్యలు తీసుకుంటూ, ప్రధాన బాధ్యులను రక్షిస్తున్నారనే అనుమానం వ్యక్తం చేసిన ఏఐకేఎస్ నాయకులు, నమోదైన కేసులపై పారదర్శక విచారణ జరగాలని కోరారు. ఆలయ ట్రస్టు పరిపాలనపై కూడా సమగ్ర విచారణ అవసరమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ఏర్పడిన ట్రస్ట్ పరిపాలనలోనే ఈ భారీ దోపిడీ జరిగినా, ప్రధానమంత్రి మౌనం ఈ దోపిడీకి పరోక్ష ఆమోదమేనని పేర్కొన్నారు. ఈ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ చంపత్ రాయ్ అని , ట్రస్ట్‌పై పూర్తి నియంత్రణ ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ కూడా ఈ వ్యవహారం నుండి చేతులు దులుపుకోలేదని అఖిల భారత కిసాన్ సభ ఎత్తి చూపింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో వెంటనే రాజీనామా చేయాలని, దోపిడీకి సంబంధించిన ఆస్తులను జప్తు చేయాలని, లబ్ధిదారుల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు తగిన పరిహారం, పునరావాసం కల్పించాలని, ప్రస్తుత ఆలయ ట్రస్టు స్థానంలో ప్రభుత్వ నియంత్రిత పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కిసాన్ సభ డిమాండ్ చేసింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్