- 16 ఏళ్లలోపు టీనేజర్ల వినియోగంపై ఆస్ట్రేలియా అధ్యయనం వెల్లడి
క్యాన్‌బెర్రా: 16 ఏళ్లలోపు పిల్లలపై ఆస్ట్రేలియా అమలు చేస్తున్న సోషల్ మీడియా నిషేధం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదని తాజా అధ్యయనం వెల్లడించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా వేదికల వినియోగాన్ని పరిమితం చేయడానికి తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల టీనేజర్ల ఆన్‌లైన్ అలవాట్లలో గణనీయమైన మార్పులు కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు. ఆన్‌లైన్ వేధింపులు, హానికరమైన కంటెంట్, అల్గారిథమ్‌ల ప్రభావం నుంచి పిల్లలను రక్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గత డిసెంబర్‌లో 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వేదికల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, తాజాగా దీనిపై నిర్వహించిన తొలి సమగ్ర మూల్యాంకనంలో ఆశించిన ఫలితాలు కనిపించలేదని తేలింది.
బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన పీర్-రివ్యూడ్ అధ్యయనం ప్రకారం, చిన్న వయస్సు వినియోగదారులు పెద్దల పేరిట ఉన్న ఖాతాలను ఉపయోగించడం, నకిలీ ఖాతాలు సృష్టించడం లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ ద్వారా ఆంక్షలను సులభంగా దాటవేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వినియోగం కొనసాగుతోందని పరిశోధకులు గుర్తించారు.
ఆంక్షలు అమల్లోకి రాకముందు మరియు అమలైన మూడు నెలల తర్వాత 400 మందికి పైగా యువ వినియోగదారులపై నిర్వహించిన సర్వేలో 12–13 ఏళ్ల వయస్సు గల వారిలో పెద్దగా మార్పు కనిపించలేదు. 14–15 ఏళ్ల వయస్సు గల వారిలో స్వల్ప తగ్గుదల నమోదవగా, 16 ఏళ్లు పైబడిన వారి వినియోగంలో పెరుగుదల కనిపించింది.
“16 ఏళ్లలోపు కౌమారదశ యువత సోషల్ మీడియా వినియోగంపై ఈ చట్టం తక్షణ ప్రభావం చూపిందని నిర్ధారించేంత ఆధారాలు లభించలేదు” అని పరిశోధకులు పేర్కొన్నారు. పరిమిత అమలు, అసంపూర్ణ అనుసరణ, ఆంక్షలను తప్పించుకునే మార్గాల వినియోగం ఈ పరిస్థితికి కారణమని వారు అభిప్రాయపడ్డారు.
అయితే చట్టం అమలులో విఫలమవుతున్నది ప్రభుత్వం కాదని, టెక్ కంపెనీలేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. మైనర్ వినియోగదారులను గుర్తించి తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోని సంస్థలకు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, యునైటెడ్ కింగ్‌డమ్, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, న్యూజిలాండ్ వంటి దేశాలు కూడా ఇలాంటి ఆంక్షలను పరిశీలిస్తున్నాయి. మరోవైపు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆస్ట్రేలియా చర్యకు పలువురు తల్లిదండ్రులు మద్దతు తెలుపుతున్నారు. అయితే సోషల్ మీడియా సంస్థలు మాత్రం ఈ నిషేధాలు యువతను మరింత అనియంత్రిత, ప్రమాదకర ఆన్‌లైన్ వేదికల వైపు నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.
కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు ఫోటోల ఆధారంగా వయస్సును అంచనా వేయడానికి AI సాధనాలను ఉపయోగిస్తుండగా, వినియోగదారులు ప్రభుత్వ గుర్తింపు కార్డును అప్‌లోడ్ చేయడం ద్వారా కూడా తమ వయస్సును నిరూపించుకోవచ్చు.








కామెంట్‌లు (0)