mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెనిజులా, జపాన్‌లలో భారీ భూకంపాలు..

3 గంటల క్రితం

earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 07:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- భారీ నష్టం

టోక్యో/కారకాస్: వెనిజులా, జపాన్ దేశాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. వెనిజులాలో వరుసగా వచ్చిన రెండు భారీ భూకంపాలు రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించగా, జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం నమోదైంది. జపాన్‌లో పెద్దగా నష్టం జరగకపోయినా, వెనిజులా తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వెనిజులాలో మొదట రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం కరేబియన్ తీరంలోని మోరాన్ నగరానికి సమీపంలో 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది. రెండో భూకంప కేంద్రం మోరాన్ నగరానికి నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) వెల్లడించింది.

ఈ ప్రకంపనలతో రాజధాని కారకాస్‌లో అనేక భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భవనాల గోడలు కూలిపోగా, రెండు ప్రధాన నివాస ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నష్టం, గాయపడిన వారి వివరాలను అధికారులు సేకరిస్తుండగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు, ఉత్తర జపాన్‌లోని ఇవాటే తీర ప్రాంతంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం భూమికి 50 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. హషికామి ప్రాంతంలో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే హచినోహే నగరంలో రవాణా వ్యవస్థలు, ప్రజల సాధారణ జీవనంపై ఎలాంటి ప్రభావం లేదని జపాన్ మీడియా వెల్లడించింది. సునామీ ముప్పు కూడా లేదని అధికారులు స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్