- వినిసియస్ మెరుపులు
- నేమార్ రీ-ఎంట్రీతో అభిమానుల్లో ఉత్సాహం
మయామి, జూన్ 25: స్టార్ ఫార్వర్డ్ వినిసియస్ జూనియర్ అద్భుత ప్రదర్శనతో బ్రెజిల్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్-సి చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను 3-0 తేడాతో ఓడించిన బ్రెజిల్, గ్రూప్ విజేతగా తదుపరి దశలోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో వినిసియస్ రెండు గోల్స్ చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. మరోవైపు, గాయం నుంచి కోలుకున్న సూపర్‌స్టార్ నేమార్ మూడేళ్ల విరామం తర్వాత బ్రెజిల్ జట్టు తరఫున మైదానంలోకి దిగడం అభిమానులను ఉత్సాహపరిచింది.
మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషంలోనే వినిసియస్ జూనియర్ స్కాట్లాండ్ డిఫెన్స్ పొరపాటును సద్వినియోగం చేసుకుని తొలి గోల్ సాధించాడు. 22వ నిమిషంలో మరోసారి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపినప్పటికీ, రిఫరీ పరిశీలన అనంతరం ఆ గోల్‌ను తిరస్కరించారు. అయితే తొలి అర్ధభాగం అదనపు సమయంలో వినిసియస్ అద్భుతమైన హెడర్‌తో తన రెండో గోల్ నమోదు చేసి బ్రెజిల్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.
రెండో అర్ధభాగంలో కూడా బ్రెజిల్ దూకుడు కొనసాగించింది. 60వ నిమిషంలో మట్యూజ్ కున్హా గోల్ చేయడంతో స్కోరు 3-0కు చేరింది. అనంతరం స్కాట్లాండ్‌కు అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది.
ఇక ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది నేమార్ పునరాగమనం. 76వ నిమిషంలో ప్రత్యామ్నాయ ఆటగాడిగా మైదానంలోకి వచ్చిన నేమార్, మూడేళ్ల తర్వాత బ్రెజిల్ జెర్సీలో కనిపించాడు. అక్టోబర్ 2023లో ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన అనంతరం జాతీయ జట్టుకు దూరమైన అతడు, ఇప్పుడు తిరిగి జట్టులో చేరడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. వినిసియస్ మెరుపులు, నేమార్ రీ-ఎంట్రీతో బ్రెజిల్ నాకౌట్ పోరుకు సిద్ధమైంది.








కామెంట్‌లు (0)