- భూకంప బాధితులకు మదురో దంపతులు సంఘీభావం
- జాతీయ ఐక్యత, సహాయ చర్యలకు పిలుపు
కారకాస్ : వెనిజులాను వణికించిన భారీ భూకంపాల నేపథ్యంలో దేశ ప్రజలకు అధ్యక్షుడు నికోలస్ మదురో ఐక్యతతో విపత్తును జయిద్దామని పిలుపునిచ్చారు. నిర్బంధంలో ఉన్న మదురో, తన భార్య సిలియా ఫ్లోరెస్‌తో కలిసి భూకంప బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, గాయపడినవారి త్వరితగతిన కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. జనవరి 3న వెనిజులాపై జరిగిన సైనిక దాడిలో చట్టవిరుద్ధంగా అపహరణకు గురైన అధ్యక్షుడు మదురో, అమెరికాలో వివాదాస్పద న్యాయ విచారణను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ప్రేరణాత్మక సందేశాన్ని పంపారు.
''దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ విపత్తును అధిగమించేందుకు గరిష్ట ఐక్యత, సంఘీభావం, కార్యాచరణ అవసరమని'' మదురో పేర్కొన్నారు. పిల్లలు, వృద్ధులు, బలహీన వర్గాల ప్రజలను రక్షించాలని స్థానిక సమాజాలకు పిలుపునిచ్చారు. “ఈ క్లిష్ట సమయంలో పరస్పరం సహాయం చేసుకోవాలి, రక్షించుకోవాలి, పంచుకోవాలి, ఒకరినొకరు నిలబెట్టాలి, దేశాన్ని పునర్నిర్మించాలి” అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. వెనిజులా ప్రజల చారిత్రక సంకల్ప శక్తిపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు.
రక్షణ, సహాయక చర్యల్లో పాల్గొంటున్న వెనిజులా సాయుధ దళాలు, జాతీయ పోలీసు బలగాలు, సివిల్ ప్రొటెక్షన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు మరియు వేలాది మంది స్వచ్ఛంద కార్యకర్తలను మదురో అభినందించారు. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించి, అన్ని అనవసర కార్యకలాపాలను నిలిపివేసిన తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ యొక్క సంస్థాగత సామర్థ్యంపై సంపూర్ణ విశ్వాసాన్ని మదురో వ్యక్తం చేశారు.
ఉత్తర వెనిజులాను వరుసగా ఒక నిమిషం వ్యవధిలో తాకిన 7.1, 7.5 తీవ్రతల రెండు భారీ భూకంపాలు దేశంలో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. గత శతాబ్దంలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంప ఘటనల్లో ఇదొకటిగా భూకంప నిపుణులు పేర్కొంటున్నారు. రాజధాని కారకాస్‌తో పాటు మరో ఆరు రాష్ట్రాల్లో భవనాలు దెబ్బతినగా, ప్రాణనష్టం కూడా సంభవించినట్లు సమాచారం. శిథిలాల తొలగింపు, బాధితుల రక్షణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.









కామెంట్‌లు (0)