1969 జూలై 20న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తొలి అడుగు వేసినప్పుడు అది మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత మరో 11 మంది వ్యోమగాములు చంద్రుడిపై నడిచారు. అయితే వారందరూ పురుషులే. అర్ధ శతాబ్దానికి పైగా గడిచినా ఇప్పటికీ ఒక్క మహిళ కూడా చంద్రుడిపై అడుగు పెట్టలేదు. ఈ చారిత్రక లోటును భర్తీ చేస్తామని ప్రపంచానికి హామీ ఇచ్చిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటోంది. కారణం... చంద్రయాత్ర కోసం సిద్ధమవుతున్న ప్రతిష్ఠాత్మక ఆర్టెమిస్ కార్యక్రమంలోని కీలక మిషన్‌కు ప్రకటించిన వ్యోమగాముల బృందంలో ఒక్క మహిళా లేకపోవడం.
2026 జూన్ 9న హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో నాసా ఆర్టెమిస్-3 మిషన్ బృందాన్ని ప్రకటించింది. రాండీ బ్రెస్నిక్, ఫ్రాంక్ రుబియో, లూకా పార్మిటానో, ఆండ్రే డగ్లస్‌లతో కూడిన ప్రధాన బృందాన్ని, బాబ్ హైన్స్‌ను ప్రత్యామ్నాయ వ్యోమగామిగా ఎంపిక చేసింది. "చంద్రుడిపై తొలి మహిళ" అనే లక్ష్యంతో ఎన్నో సంవత్సరాలుగా ప్రచారం చేసిన ఆర్టెమిస్ కార్యక్రమంలో ఇప్పుడు ఎందుకు పూర్తిగా పురుషులతో కూడిన బృందాన్ని ఎంపిక చేశారనే ప్రశ్నలు మొదలయ్యాయి. ముఖ్యంగా శాస్త్రవేత్తలు, మహిళా హక్కుల కార్యకర్తలు, అంతరిక్ష పరిశోధనలను దగ్గరగా గమనించే పరిశీలకులు ఈ నిర్ణయాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు. ప్రస్తుతం నాసా యాక్టివ్ వ్యోమగాముల బృందంలో సుమారు 40 శాతం మంది మహిళలే. వారిలో చాలామందికి అంతరిక్ష ప్రయాణ అనుభవం ఉంది. కొందరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేశారు. మరికొందరు దీర్ఘకాలిక మిషన్లకు శిక్షణ పొందుతున్నారు. ఆర్టెమిస్-2 మిషన్‌లో చంద్రుడి చుట్టూ ప్రయాణించిన క్రిస్టినా కోచ్ వంటి ప్రముఖ మహిళా వ్యోమగాములు కూడా ఉన్నారు. 2019లో ఆర్టెమిస్ కార్యక్రమాన్ని ప్రకటించినప్పుడు - చంద్రుడిపై తొలి మహిళను దింపడం దాని ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ప్రచారం చేశారు. అయితే నాసా ప్రణాళికల్లో వచ్చిన మార్పుల కారణంగా ప్రస్తుతం ఆర్టెమిస్-3ను చంద్రుడిపై దిగే మిషన్‌గా కాకుండా కీలక పరీక్షల కోసం ఉపయోగిస్తు న్నారు. మానవ ల్యాండింగ్ లక్ష్యాన్ని తదుపరి మిషన్లకు వాయిదా వేశారు. అయినప్పటికీ ఆర్టెమిస్ కార్యక్రమంలో ఇంత కీలకమైన మిషన్‌కు ఎంపికైన బృందంలో మహిళలకు స్థానం దక్కకపోవడమే విమర్శలకు కారణమవుతోంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పాలనలో ప్రభుత్వ సంస్థల్లో వైవిధ్యం, సమాన అవకాశాలకు ప్రాధాన్యం తగ్గిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో నాసా వెబ్‌సైట్‌లో కనిపించిన "చంద్రుడిపై తొలి మహిళ" అనే లక్ష్యాన్ని కొన్ని చోట్ల తొలగించారని విమర్శకులు గుర్తు చేస్తున్నారు.
వివక్ష లేదన్న నాసా
అయితే నాసా ఈ విమర్శలను తిరస్కరిస్తోంది. వ్యోమగాముల ఎంపిక పూర్తిగా అర్హతలు, అనుభవం, మిషన్ అవసరాల ఆధారంగానే జరిగిందని నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ స్పష్టం చేశారు. రాజకీయ జోక్యం లేదని ఆయన చెప్పారు.
ఈసారి ఎంపిక కాలేదే తప్ప మహిళలను పక్కన పెట్టాలనే ఉద్దేశం లేదని చెప్పారు. అయితే ప్రముఖ విజ్ఞాన రచయిత్రి ఎమిలీ కాలాండ్రెల్లి, మాజీ నాసా ఉపాధ్యక్షురాలు లోరీ గార్వర్ వంటి వారు ఈ వివరణతో ఏకీభవించడం లేదు. వ్యోమగాముల ఎంపిక కేవలం సాంకేతిక అర్హతల అంశం కాదని, అది ప్రాతినిధ్యం, చారిత్రక బాధ్యత, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి వంటి అంశాలతో కూడా ముడిపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.
- ఫీచర్స్ & పాలిటిక్స్ డెస్క్








కామెంట్‌లు (0)