mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionహర్మూజ్‌‌ నిర్వహణ మాదే !

2 గంటల క్రితం

Ali
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 12:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇరాన్‌ ‌రాయబారి అలీ బహ్రెయినీ

టెహ్రాన్‌, వాషింగ్టన్‌ :హర్మూజ్‌‌ జలసంధిపై నియంత్రణ తమదేనని ఇరాన్‌ ‌తేల్చి చెప్పింది. అలాగే స్తంభింపచేసిన తమ ఆస్తులు విడుదలైతే వాటిని ఎలా వినియోగించాలన్నది కూడా తాము మాత్రమే నిర్ణయించుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికా చేస్తున్న వాదనలను ఇరాన్‌ ‌రాయబారి అలీ బహ్రెయినీ మంగళవారం తోసిపుచ్చారు. ఈ ప్రక్రియలో మరే దేశానికి ఎలాంటి పాత్ర వుండబోదు, వారు తమపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోరని ఐక్యరాజ్య సమితిలో ఇరాన్‌ ‌రాయబారి బహ్రెయినీ స్పష్టం చేశారు. జెనీవాలో విలేకర్లతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చల్లో ఇరాన్‌ ‌తరపున పాల్గొన్న ప్రధాన ప్రతినిధి మహ్మద్‌ ‌బాఘెర్‌ ఘలిబాఫ్‌ ‌కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం హర్మూజ్‌‌ వ్యవహారాలన్నీ ఇరాన్‌ ‌మాత్రమే చూస్తుందని చెప్పారు. పశ్చిమాసియాలో యుద్ధానికి ముందునాటి పరిస్థితి హర్మూజ్‌‌లో ఎప్పటికీ రాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. స్విస్‌ ‌రిసార్ట్‌‌లో జరిగిన చర్చలు మంచి ఫలితాలు సాధించాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు టెలిగ్రామ్‌‌లో వీడియో పోస్ట్‌ చేశారు.

మరోవైపు స్విట్జర్లాండ్‌‌లో అమెరికాతో ఇరాన్‌ ‌సాంకేతిక చర్చలు ముగిశాయి. అణ్వాయుధాలు,ఆంక్షలకు సంబంధించిన అంశాలపై చర్చల బృందాలను ఏర్పాటు చేయాల్సి వుందని ఇరాన్‌ ‌ప్రభుత్వ మీడియా మంగళవారం తెలిపింది. ఇజ్రాయిల్‌‌తో లెబనాన్‌ చర్చలు వాషింగ్టన్‌‌లో మంగళవారం ప్రారంభం కానున్నాయి. అమెరికాతో జరిగే చర్చల్లో లెబనాన్‌‌ను కూడా భాగం చేయాలని ఇరాన్‌ ‌నిర్ణయించినప్పటికీ లెబనాన్‌ ‌మాత్రం ప్రత్యక్ష చర్చలకే పట్టుబట్టాలని ధృఢ నిశ్చయంతో వుంది. ‌కాగా తాజా దాడుల్లో దక్షిణ లెబనాన్‌‌లో ఒక వ్యక్తి మరణించాడు. రోడ్లపై శిధిలాలను తొలగిస్తున్న బుల్డోజరు సమీపంలోని బృందంపై ఇజ్రాయిల్‌ ‌కాల్పులు జరిపిందని లెబనాన్‌ ‌ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. ఇదిలావుండగా మూడు మాసాలకు పైగా టెహ్రాన్‌‌లో మూతబడిన తమ ఎంబసీని డెన్మార్క్‌‌ తిరిగి ప్రారంభించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్