యూరప్, పశ్చిమాసియాలో అమెరికా ఘర్షణలు పెంచుతోందని ఆగ్రహం*ప్యాంగ్యాంగ్ : తమ దేశం అణ్వాయుధ శక్తిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని, దానిని మరింత సుస్థిరం చేసుకుంటుందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ చెప్పారు. పాలక వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో కిమ్ ఈ వ్యాఖ్య చేశారని ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎనఏ మంగళవారం తెలిపింది. యూరప్, మధ్యప్రాచ్యంలో ఘర్షణలను అమెరికా పెంచుతోందని కిమ్ ఈ సమావేశంలో ఆరోపించారు. అగ్ర రాజ్యాల మధ్య పోటీ ఉద్రిక్తతలను పెంచిందని అన్నారు. అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా అణు సహకారాన్ని పెంచుకోవడం ద్వారా కొరియా ద్వీపకల్పంలో భద్రతా పరిస్థితులను మరింతగా దిగజార్చాయని తెలిపారు.
ప్రపంచ సైనిక, రాజకీయ పరిణామాలను ధైర్యంగా, చురుకుగా ఎదుర్కోవడానికి అణ్వాయుధ సామర్ధ్యాలను విస్తరించుకోవడం, అణ్వస్త్ర దేశంగా ఉత్తర కొరియా హోదాను బలోపేతం చేసుకోవడం తప్పనిసరని కిమ్ నొక్కి చెప్పారు. సంప్రదాయ ఆయుధాలను మరింతగా అభివృద్ధి చేయాలని, గైడెడ్ క్షిపణులతో కూడిన వ్యూహాత్మక నౌకా నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కిమ్ ఆదేశించారు.








కామెంట్‌లు (0)